ఆరావళిపై ఇచ్చిన ఉత్తర్వులపై ‘సుప్రీమ్‌’ ‌స్టే

– కొత్త కమిటీతో అధ్యయనానికి ఆదేశం

న్యూదిల్లీ, డిసెంబర్‌ 29: ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్‌ ‌వివాదంపై సిజెఐ జస్టిస్‌ ‌సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది.  ఇటీవల ఆరావళి కొండలకు ఆమోదించిన నిర్వచనాలకు సంబంధించిన కొన్ని వివరణలు అవసరమని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది, అదే సమయంలో ఈ అంశంపై గత నెలలో జారీ చేసిన తీర్పుపై స్టే విధించింది. గతంలో అధికారులతో కూడిన కమిటీ చేసిన సిఫార్సుల పర్యావరణ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని కోర్టు పేర్కొంది. ఆరావళి కొండల నిర్వచనంపై దాఖలైన సమస్యపై సుమోటో కేసులో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 100 మీటర్లలోపు ఎత్తు ఉన్న ఆరావళి పర్వతాల వద్ద మైనింగ్‌కు గతంలో అనుమతులు ఇచ్చింది సుప్రీంకోర్టు. తాజాగా గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  పర్యావరణపరంగా పలు రాష్ట్రాలకు రక్షణ కవచంగా ఉన్న ఆరావళి పర్వతాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త నిర్వచనం జాతీయస్థాయిలో దుమారం రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. గత నెల తాను ఇచ్చిన ఆదేశాలను సోమవారం నిలిపివేసింది. ‘కోర్టు ఆదేశాలు, కమిటీ సిఫార్సులు నిలిపివేయడం అవసరమని మేం భావిస్తున్నాం. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ఈ స్టే అమల్లో ఉంటుంది’ అని ధర్మాసనం పేర్కొంది. కొత్త నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.దేశంలోనే అతిపురాతన పర్వతశ్రేణి ఆరావళి. ఇక్కడ అక్రమంగా పొందిన అనుమతులతో అడ్డగోలుగా మైనింగ్‌ ‌జరుగుతోందని ఎప్పటినుంచో ఆందోళన ఉంది. ఇలాంటి సమయంలో 100 టర్లు… అంటే 328 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవి మాత్రమే పర్వతాలంటూ కేంద్రం కొత్త నిర్వచనం చెప్పింది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్‌కు అనుమతించింది. దీనివల్ల హరియాణా, రాజస్థాన్‌, ‌గుజరాత్‌, ‌దిల్లీకి ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరావళి పర్వత శ్రేణులు ఉన్న రాష్ట్రాలు కొత్తగా మైనింగ్‌ ‌లీజులేవీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. గుజరాత్‌ ‌నుంచి జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) ‌వరకూ విస్తరించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణుల సమగ్రతను పరిరక్షించేందుకు, గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.  విచారణ సందర్భంగా తాత్కాలిక దరఖాస్తుదారుల ప్రవర్తనపై సీజెఐ తీవ్ర అసంతృప్తి చెందారు. ఆరావళి పర్యతాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, పర్యావరణ ముప్పునకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కమిటీకి సూచించింది. ఈ కేసును జనవరి 21న వివరణాత్మకంగా విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా వాదనలు వినిపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *