ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు మరోమారు సీరియస్‌

-‌ ప్రజల సొమ్మును దుబారాపై ఆగ్రహం
– పేదలకు విద్య తదితర కనీస అవసరాలు కల్పించాల్సిందే
– చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌ధర్మాసనం వ్యాఖ్యలు

న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: దేశంలో రాజకీయ పార్టీలు అందిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో స్పందించింది. తమిళనాడు విద్యుత్‌ ‌పంపిణీ సంస్థకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశ మయ్యాయి. ఉచిత పథకాల వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుందని కోర్టు హెచ్చరించింది. తమిళనాడులో ఉచిత విద్యుత్‌ ‌సరఫరా, ఆర్థిక స్థితిగతులపై విచారణ చేపట్టిన కోర్టు, విద్యుత్‌ ‌పంపిణీ సంస్థకు నిధులు ఎక్కడి నుండి వొస్తున్నాయో వివరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ ‌దాఖలు చేయాలని కోరింది.  పేదలకు విద్య, కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని కోర్టు అంగీకరించింది. అయితే, పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఉచిత విద్యుత్‌ అం‌దించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ’సౌకర్యం కావాలనుకున్నప్పుడు డబ్బులు చెల్లించాలి కదా! పెద్ద భూస్వాములు ఉచితం అని అనవసరంగా లైట్లు, మెషీన్లు వాడుతున్నారు’ అని జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే ఉచిత పథకాలను ప్రకటించే సంస్కృతిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు, సామాజికవేత్తలు తమ సిద్దాంతాలను పునరాలోచించు కోవాల్సిన అవసరం ఉందని హితవు పలికింది. ప్రభుత్వం ఇచ్చే ఉచితాల వెనుక ఉన్నది ప్రజల కష్టార్జితమైన పన్నుల సొమ్ము అని కోర్టు గుర్తు చేసింది. రాష్టాల్రు అప్పుల్లో ఉన్నప్పటికీ ఉచిత పథకాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.  రాష్ట్రాలు వసూలు చేసే ఆదాయంలో కనీసం 25 శాతాన్ని రాష్ట్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎందుకు ఉపయోగించకూడదని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు, ’ఉచితాలు ఎన్నాళ్లు కొనసాగుతాయి?’ అన్న సుప్రీంకోర్టు ప్రశ్న ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మారింది. సంక్షేమం పేరుతో ఆర్థిక క్రమశిక్షణను విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని అత్యున్నత న్యాయస్థానం పరోక్షంగా హెచ్చరించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *