భోజ్‌శాలపై సుప్రీం కీలక ఆదేశాలు

-ఇరు మతస్థుల పూజలు, ప్రార్థనలకు అనుమతి

భోపాల్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి22: మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల ఆలయం-కమల్‌ ‌మౌలా మసీదు కాంప్లెక్స్ ‌వద్ద ప్రార్థనల విషయంలో సుప్రీంకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాంతంలో శుక్రవారం హిందూ, ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించింది. వసంత పంచమి సందర్భంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ హిందూ మతస్థులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. నమాజ్‌ ‌చేసుకునేందుకు వచ్చే ముస్లిం కమ్యూనిటీ వ్యక్తుల జాబితాను జిల్లా యంత్రాంగానికి అందజేయాల్సి ఉంటుందని సీజేఐ సూర్య కాంత్‌, ‌న్యాయమూర్తులు జాయ్‌మాల్యా బాగ్చి, విపుల్‌ ఎం ‌పాంచోలితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇరువర్గాల వారు పరస్పరం గౌరవించుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాష్ట్ర, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని సూచించింది. భోజ్‌శాల 11వ శతాబ్దం నాటి కట్టడమని, సరస్వతీ దేవి ఆలయమని హిందువుల వాదనగా ఉంది. ముస్లింలు దీనిని కమల్‌ ‌మౌలా మసీదుగా పిలుస్తుంటారు. 2003లో ఇందుకు సంబంధించి ఏఎస్‌ఐ ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారం నమాజ్‌లు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ చేసుకోవచ్చని, హిందువులు వసంత పంచమి పూజలు నిర్వహించుకోవచ్చని, ప్రతి మంగళవారం వారికి అనుమతి ఉంటుందని సుప్రీం  ఆదేశాల్లో పేర్కొంది. అయితే.. వసంత పంచమి శుక్రవారం నాడు వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేది అందులో పేర్కొనలేదు. ఈసారి జనవరి 23న వసంత పంచమి, శుక్రవారం కలిసి రావడంతో ఇరువర్గాలు తమ మతపరమైన ప్రార్థనలు నిర్వహించు కునేందుకు అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *