– విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
– వివరాలతో సిద్దంగా ఉండాలని ఆదేశం
– ఆధార్‌ను పౌరసత్వంగా గుర్తించలేమన్న ధర్మాసనం
న్యూదిల్లీ, ఆగస్ట్ 12 : బిహార్‌లో వోటర్ల జాబితా(Bihar voters list) ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(supreme court) విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సరైన వివరాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం సూచించింది. విచారణ క్రమంలో ఆర్జేడీ నేత మనోజ్ ఝా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఓ నియోజకవర్గంలో 12 మంది చనిపోయారని ఈసీ పేర్కొందని, కానీ వారు సజీవంగా ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరో సందర్భంలో.. బతికే ఉన్న వ్యక్తులను చనిపోయినట్లు ప్రకటించారని ఆరోపించారు. అయితే.. ఇటువంటి పక్రియలో కొన్ని లోపాలు ఉంటాయని ఈసీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదీ వాదించారు. చనిపోయిన వ్యక్తులను బతికి ఉన్నట్లు, సజీవంగా ఉన్నవారిని చనిపోయినట్లు ప్రకటించడం వంటి తప్పిదాలను సరిదిద్దవచ్చని.. ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే.. వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి ‘సుప్రీం’ ధర్మాసనం సూచించింది. ఎస్‌ఐఆర్ పక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది వోటర్లు ఉన్నారు. గతంలో నమోదైన మరణాల సంఖ్య, ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య వంటి వివరాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. బిహార్ ఎస్‌ఐఆర్‌లో సామూహికంగా వోటర్లను తొలగిస్తే తక్షణమే జోక్యం చేసుకుంటామని జులై 29న సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్న విషయం తెలిసిందే. అంతకుముందు జులై 10న చేపట్టిన విచారణ సందర్భంగా.. బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ను నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై స్టే విధించేందుకు నిరాకరించింది. అదేవిధంగా ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా వోటర్ ఐడీ కార్డును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఆధార్ సేవలను కీలకమైన గుర్తింపు డాక్యుమెంట్‌గానే పరిగణనలోకి తీసుకుంటున్నామని, భారతదేశ పౌరసత్వానికి అది కచ్చితమైన రుజువు కాదని, సరైన వెరిఫికేషన్ తప్పనిసరని ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న వైఖరిని సుప్రీంకోర్టు సమర్ధించింది. బిహార్ ప్రత్యేక సమగ్ర సవరణ కు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆధార్‌ను కంక్లూజివ్ ప్రూఫ్‌గా ఆమోదించలేమని ఎన్నికల కమిషన్ చెప్పడం సరైనదేనని జస్టిస్ సూర్య కాంత్ అన్నారు. వోటర్ వెరిఫికేషన్ పక్రియను చేపట్టే అధికారం ఈసీఐకి ఉందా అనే ప్రాథమిక అంశాన్ని నిర్ణయించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాంటి అధికారం లేనట్టయితే ఈ అంశం ఇక్కడితో ముగుస్తుందని, ఆ అధికారం ఈసీఐకి ఉన్నట్లయితే వోటర్ వెరిఫికేషన్ పక్రియపై ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ తన వాదన వినిపిస్తూ 1950 తర్వాత పుట్టిన ప్రతివ్యక్తి భారతదేశ పౌరుడేనని, అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎక్సర్‌సైజ్‌లో విధానపరమైన తీవ్ర తప్పిదాలున్నాయని అన్నారు. ఉదాహరణగా ఒక చిన్న అసెంబ్లీ నియోజకవర్గంలో నివసిస్తున్న 12 మందిని చనిపోయినట్టు పేర్కొన్నారని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించ లేదన్నారు. పోల్ ప్యానల్ సరైన విధానాన్ని అనుసరించకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపు జరిగిందని, ముఖ్యంగా అవసరమైన దరఖాస్తులు సమర్పించలేక పోయిన వారిపై ఈ ప్రభావం ఉంటుందని అన్నారు. 2003 వోటర్ల జాబితాలో పేరున్న వారిని కూడా కొత్తగా ఫామ్‌లు సమర్పించమనడం, అలా చేయని పక్షంలో రెసిడెన్స్‌లో ఎలాంటి మార్పు లేనప్పటికీ వారిని తొలగించడం జరుగుతుందన్నారు. ఈసీఐ ప్రకటించిన గణాంకాల ప్రకారం 7.24 కోట్ల మంది అవసరమైన ఫామ్స్ దాఖలు చేశారని, అయినా 65 లక్షల మంది వోటర్ల పేర్లు సరైన వెరిఫికేషన్ లేకుండా తొలగించారని అన్నారు. పేర్ల తొలగింపును బలపరచే ఎలాంటి సర్వే నిర్వహించ లేదని అఫిడవిట్‌లో ఎన్నికల కమిషన్ అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటువంటి పక్రియలో కొన్ని లోపాలు ఉంటాయని ఈసీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదించారు. చనిపోయిన వ్యక్తులను బతికి ఉన్నట్టు, సజీవంగా ఉన్నవారిని చనిపోయినట్టు ప్రకటించడం వంటి తప్పదాలని సరిదిద్ద వచ్చన్నారు. ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలోనే వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఇదిలా ఉండగా.. బిహార్‌లో వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ఈ నెల 1న ముసాయిదా జాబితాను ప్రచురించారు. ఎస్‌ఐఆర్ పక్రియ చేపట్టక ముందు రాష్ట్రంలో మొత్తం నమోదిత వోటర్ల సంఖ్య 7.9 కోట్లుగా ఉండగా, ముసాయిదాలో అది 7.24 కోట్లకు తగ్గింది. సెప్టెంబర్ 30న తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.





