– కుల్దీప్ సింగ్ సెంగార్‌కు బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు
న్యూదిల్లీ, డిసెంబర్ 29: ఉన్నావ్ అత్యాచారం కేసులో సుప్రీమ్ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్‌కు దిల్లీ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఇద్దరు న్యాయవాదులు సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు ఇదే విషయమై సీబీఐ కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్లు వేసింది. కుల్దీప్ బయటకు వస్తే కేసుపై ప్రభావం పడే అవకాశముందని సీబీఐ పేర్కొంది.ఈ వ్యాజ్యంపై సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జేకే.మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. సోమవారం విచారణ చేపట్టింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సీబీఐ ప్రస్తావించిన అంశాలను ధర్మాసనం పరిశీలించింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను నిలిపివేయడంతోపాటు నిందితుడు కుల్దీప్ సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్‌ను ఆదేశించింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో 17ఏళ్ల ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, నాటి బీజేపీ నేత కుల్దీప్ సెంగార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేలాడు. అయితే.. ఈ కేసు విచారణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2018లో ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టింది. ఆ తర్వాత యూపీ ట్రయల్ కోర్టు, దిల్లీ కోర్టులకు మారింది. 2019 డిసెంబర్‌లో కుల్దీప్ దోషిగా తేలడంతో అతనిపై జీవితఖైదు విధించింది న్యాయస్థానం. తాజాగా ఈ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సెంగార్‌కు పోక్సో చట్టం వర్తించదని దిల్లీ హైకోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.