– పిటిషనర్ పెద్దిరాజుకు కోర్టు ధిక్కరణ నోటీసు
న్యూదిల్లీ, జులై 29 : భూవివాదం కేసులో ఎన్.పెద్దిరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారంటూ 2016లో రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యలపై పెద్దిరాజు చేసిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పీఎస్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనపై కేసు కొట్టివేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి 2020లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఫిర్యాదుదారు ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కేసును కొట్టివేసింది. అనంతరం కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పెద్దిరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మం
గళవారం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పునకు సంబంధించిన అంశాలతోపాటు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పిటిషన్‌దారు పెద్దిరాజు, ఆయన లాయర్ రితేష్‌పాటిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరాజు పిటిషన్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. అలాగే ఆయనతోపాటు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ బీఆర్ గవాయి తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే న్యాయవాది రితీష్ పాటిల్ కోర్టు సాక్షిగా క్షమాపణ కోరుతూ కేసు వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదంటూ సీజేఐ ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణ నోటీస్‌పై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని, ఆ సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు.





