– “ముడా” కేసులో ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
– కేసును కొట్టివేస్తూ తీర్పు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 21: కర్ణాటకలోని రూ.వందల కోట్ల విలువైన మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కుంభకోణానికి సంబంధించి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతికి సమన్లు జారీ చేయడాన్ని క్వాష్ చేస్తూ హైకోర్టు తీసుకొన్న నిర్ణయాన్ని ఈడీ సుప్రీంలో సవాలు చేసింది. దీనిని తాజాగా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలని పేర్కొంది. అలాంటి పోరాటాలకు ఈడీని ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించింది. దురదృష్టవశాత్తూ నాకు మహారాష్ట్రలో అనుభవం ఉంది. మేము మాట్లాడేటట్లు ఒత్తిడి చేయొద్దు. ఒకవేళ అలాచేస్తే.. మేము ఈడీ గురించి కఠిన విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల్లో రాజకీయ యుద్ధాలు చేసుకోనివ్వండి. మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించింది. ఈసందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు స్పందిస్తూ తాము పిటిషన్‌ను ఉపసంహరించుకొంటామని పేర్కొన్నారు. ఆ తర్వాత కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు సింగిల్‌బెంచ్ జడ్జి తీసుకొన్న నిర్ణయంలో ఎటువంటి లోపం లేదని పేర్కొంది. మైసూరులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి మూడు ఎకరాల భూమి ఉండేది. దానిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ’ముడా’ దానిని స్వాధీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కెసరెలోని ల్యాండ్‌తో పోలిస్తే.. విజయనగరలో భూమి మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. అదే విమర్శలకు కారణమైంది. ఆ తర్వాత ఆమె ఆ భూమిని సరెండర్ చేశారు. ఈక్రమంలో పార్వతికి ఈడీ జారీ చేసిన సమన్లను హైకోర్ట్ సింగిల్ బెంచ్ జడ్జి ఎం.నాగప్రసన్న క్వాష్ చేశారు. తాజాగా దీనిపైనే ఈడీ సుప్రీంలో అప్పీల్ చేసింది. ఈ వ్యవహారంపై ఇడి జోక్యంపై సుప్రీం మండిపడింది.





