– దిల్లీకి వెళ్లి పత్తి సమస్యలు ప్రధానికి తెలపాలి
– లేదంటే సిఎం ఇంటి ముందే పత్తి పోసి ధర్నా చేస్తా
– వరంగల్ ఎనుమాముల మార్కెట్ సందర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు
వరంగల్, ప్రజాతంత్ర, నవంబరు 18: పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలస్ ముందు పోసి ఇంటిని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను హరీష్ రావు, బీఆర్‌ఎస్ నేతలు మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సీసీఐ తుగ్లక్ చర్యల వల్ల రైతులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు విధి లేక దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రైతులను నిలువునా ముంచుతున్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి అరవైసార్లు దిల్లీకి వెళ్లారని, మూటలు పంపుతున్నారు గానీ రైతుల సమస్యలు బడేబాయ్‌కు చెప్పరా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారని, మరి రైతులకు మద్దతు ధర ఇప్పించరా అంటూ నిలదీశారు. కపాస్ యాప్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలకంటే పంట పొలాల్లో దిష్టి బొమ్మలు నయమంటూ వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకునేందుకు నిబంధనలు సడలించారని, కానీ రైతులకు మాత్రం న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకూ 406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవాలు జరుపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హరీష్ రావుతో పాటు పత్తి యార్డును ఎర్రబెల్లి దయాకర్ రావు, మధుసూదనాచారి, చల్లా ధర్మారెడ్డి, మాలోత్ కవిత పరిశీలించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంట దాకా అన్నీ సమస్యలేనని హరీష్ రావు విమర్శించారు. సమయానికి ఎరువులందవు, కరెంటు సరిగ్గా రాదు, రైతుబంధు రాదు, రుణమాఫీ లేదు, బోనస్, పంటల బీమా ఊసేలేదని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్‌లో చెప్పిన ఒక్క హామీ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లు, కార్పొరేట్లకు లాభం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, బీజేపీ తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులన్నీ రెండు రోజులుగా మూతపడ్డాయి. పత్తి రైతులంతా అయోమయంలో ఉన్నారు. ఈరోజు రైతులకు పత్తిని అమ్ముకోవడానికి అవకాశం లేక దళారులకు అమ్ముకునే పరిస్థితి వొచ్చింది. పత్తికి మద్దతు ధర రూ. 8,100. కానీ, రూ.6 వేలకే అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మాటల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరచేతిలో వైకుంఠం చూపించి, చేతల్లో నరకం చూపిస్తున్నాయన్నారు. వరదలు, తుఫాన్‌ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతే తుగ్లక్ నిర్ణయాలతో మరింత ఇబ్బంది పెట్టడం సరికాదు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. పంట చేలన్నీ దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వొచ్చింది. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 8 నుంచి 12 శాతం తేమ విధానాన్ని సవరించి, కపాస్ యాప్ ని రద్దు చేయండి. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం వల్ల కపాస్ యాప్‌లో నమోదు చేయడం రైతులకు కష్టమైన పని. గత సంవత్సరం లాగానే 12 క్వింటాల పత్తి కొనాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. బీజేపీ ఎంపీలు ఒక్కసారి కూడా నోరు విప్పరు. రైతుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కేసీఆర్‌ని, బీఆర్‌ఎస్‌ని తిట్టడం తప్ప బీజేపీ ఎంపీలకు మరో పని చాతకాదు. కాంగ్రెస్ ప్రశ్నించదు అంటూ మండిపడ్డారు. ములుగు నియోజకవర్గంలో చింతకుంట, మంగపేట మండలాల నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య మక్కలు అమ్మడానికి ఎనుమాముల మార్కెట్‌కి వచ్చారు. క్వింటల్ మక్కలు రూ.1800 కు రైతులు అమ్ముతున్నారు, రూ.2400 మక్కకు మద్దతు ధర. మక్క రైతులు క్వింటాలకు రూ.570 నష్టపోతున్నారు. ఎవరికైనా మక్క రైతులకు పైసలు విడుదల చేశారా అని మార్క్ ఫెడ్ అధికారులను అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా విడుదల చేయలేదని సమాధానం ఇచ్చారు. పోయిన యాసంగిలో రైతులకు రావలసిన రూ.1,100 కోట్ల బోనస్‌ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం కొన్న రైతులకు కూడా రూ.1,400 కోట్ల బకాయిలు పడ్డాయి. పంటల బీమా తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు అయినా రైతులకు అందించడంలో విఫలమైంది. పంటల బీమా ఉండి ఉంటే నష్టపోయిన పంటకు రైతులకు నష్టపరిహారాలు అందేది కదా. బోనస్ ఎగ్గొడివితి. రైతుబంధు రెండు పంటలకు ఎగబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కరెంటు లోవోల్టేజ్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయన్నారు. సిఎం రేవంత్ దిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిసి నిబంధనలు ఎత్తివేసి పత్తికొనే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వరంగల్ వరదల్లో 20 వేల ఇండ్లు మునిగిపోయాయి. సకాలంలో గేట్లు ఎత్తి ఉంటే వరంగల్ నగరం ముగిపోయేది కాదు. మునిగిపోయిన ఇళ్లకు రూ. 15 వేలు ఇస్తామన్నారు. రెండు నెలలు అయింది ఒక రూపాయి ఇవ్వలేదు. వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




