మా ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి.

– కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామ‌న్‌కు విజ్ఞ‌ప్తి
– దిల్లీలో బడ్జెట్ స‌న్నాహ‌క స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10ః తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. న్యూదిల్లీలో శ‌నివారం బడ్జెట్ స‌న్నాహ‌క‌ సమావేశంలో పాల్గొన్న ఆయ‌న ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర-రాష్ట్రాల సమన్వయం ద్వారానే ఒక దేశం పురోగమిస్తుంద‌ని, కేంద్ర బడ్జెట్ తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడంలో చొరవ సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని అన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతం ఉంద‌ని, త‌మ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాము తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించామ‌ని తెలిపారు. దీని ద్వారా తెలంగాణను ప్రస్తుతం ఉన్న 200 బిలియన్ డాలర్ల నుండి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నిస్తున్నామ‌న్నారు. తద్వారా దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రంలో పెట్టుబడి రేటును ప్రస్తుత 37 శాతం నుంచి 50 శాతానికి (జీఎస్‌డీపీలో) పెంచాల్సి ఉంది. రాష్ట్రాల ద్రవ్య లోటు పరిమితిని ఏడాదికి కనీసం 4 శాతానికి పెంచాలి. రాష్ట్రాలకు ఇస్తున్న 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చాలని, ఆ సహాయాన్ని రెట్టింపు చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య రంగాల కోసం సేకరించే వనరులను ఎఫ్ ఆర్‌బీఎమ్ పరిమితుల నుంచి మినహాయించాలి. తెలంగాణలో ప్రస్తుతం 1000కి పైగా కులాల వారీగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. త‌మ ప్రభుత్వం 119 నియోజకవర్గాల్లో ఆధునిక వసతులతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నాము.

కేంద్రం తన మొత్తం వ్యయంలో 20 శాతం కంటే ఎక్కువ రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంశాలపై ఖర్చు చేస్తోంది. ఇందులో 25 శాతం తగ్గించి, ఆ రూ.2.21 లక్షల కోట్లను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేయాలని సూచిస్తున్నామ‌ని తెలిపారు. ప్రస్తుతం సెస్‌లు, సర్‌చార్జీల వాటా కేంద్ర పన్ను రాబడిలో 20 శాతానికి చేరింద‌ని, దీని వల్ల 15వ ఆర్థిక సంఘం 41 శాతం పన్ను బదిలీని సిఫార్సు చేసినప్పటికీ రాష్ట్రాలకు 30 శాతం మాత్రమే అందుతోంద‌ని తెలిపారు. .దాదాపు రూ.1,55,000 కోట్ల సర్ చార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలని కోరారు. లేదా వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి.రాష్ట్రంలో ప్రాంతీయ రింగ్ రోడ్ ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకుని అనుమతులు ఇవ్వాలి.. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటును ప్రకటించాలి.. మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలి.. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంల‌లో విమానాశ్రయాలను మంజూరు చేయాలి..పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం రూ.14,100 కోట్లు, రేడియల్ రోడ్ల కోసం రూ.45,000 కోట్లు, హైదరాబాద్ మురుగు నీటిపారుదల ప్రణాళిక కోసం రూ.17,212 కోట్లు కేటాయించాలి అని కేంద్ర మంత్రి సీతారామ‌న్‌ను మంత్రి భ‌ట్టి కోరారు. త‌మ అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *