– అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారం వాస్తవం కాదు
– ఏకార్డుకైనా అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి
– సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం
– ఇండ్ల స్ధలాలకు కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం
– 14 సంఘాలతో మంత్రి పొంగులేటి సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10ః జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టి ఆ వృత్తికి వన్నెతెచ్చే జర్నలిస్టులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్నివిధాలా అండదండగా ఉంటుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జీవో 252 పై శసచివాలయంలోని తన కార్యాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమావేశంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని, ప్రస్తావించిన అంశాలను, విజ్ఞప్తులను పరిశీలించి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని, జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. గతంలో కంటే ఈసారి ఇచ్చే కార్డుల సంఖ్య ఎక్కువ ఉంటుందని వెల్లడించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలనే సదుద్దేశంతో శాస్త్రీయ పద్దతిలో అధ్యయనం చేశామని, పలుమార్లు సమావేశాలు నిర్వహించామని, అంతేగాక దేశవ్యాప్తంగా ఉన్ననియమ నిబంధనలను పరిశీలించామని, ఫలితంగా కొత్త కార్డుల మంజూరులో జాప్యం జరిగిందని అన్నారు.
రెండు కార్డుల మధ్య వ్యత్యాసం లేదు
మీడియా కార్డుకు, అక్రిడిటేషన్ కార్డుకు ఎలాంటి వ్యత్యాసం లేదని, అక్రిడిటేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పరంగా అందే ప్రతి ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా అందుతాయని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని మరోమారు స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో ఈ వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు గాను ప్రభుత్వ పరంగా సర్క్యులేషన్, ఇతర సంబంధిత వివరాలను ఖచ్చితంగా సేకరిస్తామని, ఛార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ల పరిశీలన కూడా చేస్తామని, దీనివలన అసలైన పత్రికలు, పాత్రికేయలకు న్యాయం జరుగుతుందని అన్నారు. మండలానికో విలేకరి ప్రాతిపదికన గాక జనాభా వారీగా అక్రిడిటేషన్‌లు మంజూరు చేస్తే ఎలా ఉంటుందన్న విషయం కూడా ఆలోచిస్తామని, దీనిపై పాత్రికేయ సంఘాలు స్పందించాలని అన్నారు. మహిళా జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు అక్రిడిటేషన్ కార్డుల జారీలో ప్రత్యేక కోటా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలోనే డిజిటల్ మీడియా కార్డులు మంజూరు చేశామని తెలియజేశారు.
కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం
జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాల అంశంపై కొంతమంది ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై మంత్రి స్పందిస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాల అంశాన్ని పరిష్కరించి జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి భూమిని అప్పగించిందన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కొట్టివేయడంతో సమస్య మొదటికి వచ్చిందని, అయినా కూడా ఇండ్ల స్ధలాల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని అన్నారు. ఎటువంటి కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, ఐ&పిఆర్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీపీఆర్‌వో జి.మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




