– శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2ః రైతులకు అవసరమున్నంతమేర యూరియా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఉన్న 12,000 సెంటర్లలో ఎక్కడో 2,3 సెంటర్లలో ఆతృతతో రైతులు షాపుల ముందు నిల్చున్న సందర్భాలను చూపి యూరియా కొరత అని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకుంటే రైతులు క్షమించరని ప్రతిపక్ష పార్టీలను హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న క్యూల సంగతి, ఆ క్యూలలో రైతులు మరణించిన సందర్భాల గురించి తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ ను రాష్ట్రంలో కూడా అమలు చేశామని, దీనిని ఉపయోగించిన పత్తి రైతులలో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువమంది ఉన్నారని, వారు ఈ యాప్ ని వినియోగించి పత్తి అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. ఈ యాప్ ఆధారంగా యూరియా యాప్ ను రాష్ట్రంలో ఐదు జిల్లాలలో ప్రయోగాత్మకంగా చేపట్టామన్నారు. ఈ యాప్ మీద కూడా లేనిపోని అపోహలు, గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ యాప్ ను తీసుకొచ్చే ముందు రైతులందరికీ అవగాహన కల్పించామని మంత్రి చెప్పారు. ప్రతీ రిటైల్ అవుట్ లెట్ దగ్గర ఒక వలంటీర్ ను ఉంచామని, ఈ యాప్ ప్రయోగాత్మక దశలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించామని తెలిపారు. కౌలు రైతులకు, పట్టాలు లేని రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నామని, తాను స్వయంగా రైతు వేదికల ద్వారా ఆయా జిల్లాల రైతులతో మాట్లాడితే వారు సంతృప్తి వ్యక్తం చేశారని వివరించారు. యాప్ ద్వారా డిసెంబర్ 20వ తేదీ నుండి ఇప్పటివరకు 1.18 లక్షల మంది రైతులు 3.36 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేశారన్నారు. డిసెంబర్ 31 నాటికే 4.04 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు సరఫరా చేశామన్నారు. ప్రస్తుత 2025–26 యాసంగి సీజన్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని, ఇది గత ఎనిమిదేళ్లల్లో అత్యధికమని మంత్రి చెప్పారు. యాసంగిలో డిసెంబర్ వరకు కేంద్ర కేటాయింపులు 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు గాను, ఇప్పటికే 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించుకోగలిగామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



