- వాస్తవాలకు దగ్గరగా నిధుల కేటాయించాలి
– అధికారంలోకి వచ్చి 800 రోజులైనా దిక్కులేదు
– ఎన్నికల ముందు రాసిచ్చిన బాండ్ పేపర్ల గతేమయ్యింది
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి20: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేపట్టాలని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను తయారు చేయాలని సూచించారు. సిద్దిపేటలోని 37వ వార్డులో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియా, రాహుల్ రాసిచ్చిన బాండ్ పేపర్లు ఏమాయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 800 రోజులైనా ఒక్క హామీకి దిక్కులేదు.. గెలిచిన నెలకే వృద్ధులు, బీడీ, చేనేత, గీత కార్మికులకు రూ.4000 పెన్షన్ అన్నారు.. 27 నెలలైనా రాలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిధులు పెడతారా లేదా అంటూ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టారని, రాజీవ్ యువ వికాసం బూటకమని మండిపడ్డారు. కాంగ్రెస్ తెచ్చిన ఎస్సీ, బీసీ, రైతు డిక్లరేషన్లన్నీ ఉత్త మాటలే. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకిచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని మంత్రి భట్టి విక్రమార్కను డిమాండ్ చేశారు. పిల్లలకు టెన్త్ పాస్ అయితే రూ.10వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.25 వేలు, డిగ్రీకి రూ.50వేలు, పీజీ చదివితే రూ.లక్ష ఇస్తామని చెప్పిఈరోజు వరకు ఒక్క కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా రూ.20 వేల కోట్ల బ్జడెట్ కేటాయిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక బీసీలకు కాంగ్రెస్ మొండిచేయి చూపిందని విమర్శించారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అని మాయమాటలు చెప్పారని, ఏటా రూ.15వేలు రైతుబంధు, పంటల బీమా, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నిలువునా దగా చేశారని ఆరోపించారు. గతంలో అవ్వాతాతలకు రూ.200 ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ రూ.2 వేలకు చేయగా కాంగ్రెస్ రూ.4వేలు ఇస్తామన్న హామీ ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. ఈ బడ్జెట్‌లో బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, గీత, చేనేత కార్మికులందరికీ తక్షణమే రూ.4వేలు పెన్షన్ ఇచ్చేలా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్‌నైనా వాస్తవాల ఆధారంగా రూపొందించాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.