జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలవాలి

– ఆయన గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుంది
– ఉప రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: తెలుగు వారందరం ఒక తాటిపైకి వచ్చి ‘ఇండి’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నీలం సంజీవరెడ్డి, వివిగిరి, పీవీ నరసింహారావు, జైపాల్‌ రెడ్డి, వెంకయ్యనాయుడు, ఎన్టీ రామారావు వంటి తెలుగు నేతలు గతంలో జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించారని, నేడు తెలుగు నాయకులు జాతీయ రాజకీయాల్లో అంత కీలకంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ‘ఇండి’ కూటమి ఆలోచనను జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి గౌరవించి ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగారన్నారు. ఆయన పరిచయ కార్యక్రమాన్ని హోటల్‌ తాజ్‌ కృష్ణలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏకు తమ కూటమి గట్టి పోటీ ఇస్తోందని, రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని ఎన్డీఎ కూటమి.. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ‘ఇండి’ కూటమి ఎన్నికల్లో దిగాయని చెప్పారు. ఉప రాష్ట్రపతి రాజీనామాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలుగు వ్యక్తికి జాతీయస్థాయిలో అవకాశం వచ్చిందంటూ తెలుగు వారి గౌరవం పెరిగేలా అందరూ ఒక తాటిపైకి వచ్చి సుదర్శన్‌ రెడ్డికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల అధ్యక్షులు చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌, వైఎస్‌ జగన్‌, చంద్రశేఖర్‌ రావు, ఓవైసీతోపాటు రెండు రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18మంది రాజ్యసభ సభ్యులు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని వ్యక్తిగతంగా విజప్తి చేస్తున్నానన్నారు. జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో స్థానంలో ఉన్నప్పుడు తెలుగువారు కూడా ఆ స్థాయిలో ఉండాలని, జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుందని అన్నారు. 18 ఏళ్లకు ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్‌ గాంధీ ఆలోచన ఒకవైపు.. ఓట్‌ చోర్‌ ఆలోచనతో మరో పార్టీ ఉన్నాయి అని సీఎం వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్‌ సీటులో గౌరవమైన వ్యక్తులు, అంబేద్కర్‌ విధానాలపై సంపూర్ణ విశ్వాసం ఉన్నవారు కూర్చుంటే పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. సుదర్శన్‌ రెడ్డికి సుదీర్ష అనుభవం ఉంది.. వివిధ హోదాల్లో రాజ్యాంగ స్పూర్తితో పనిచేశారు.. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు.. రాజ్యాంగాన్ని రక్షించే పార్టీలో ఆయన మొదటి సభ్యత్వం తీసుకున్నారు.. రాజ్యాంగాన్ని రక్షించడమే ఆయన పార్టీ.. ఎజెండా, జెండా లేకుండా జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి అందరూ మద్దతు ఇవ్వాలి అని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. సుదర్శన్‌ రెడ్డిని ఒక జాతీయ నాయకుడు నక్సలైట్‌ అని అంటున్నారు.. నక్సలిజం ఒక విధానం మాత్రమే.. ఆ ఫిలాసఫీ నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు.. మనకు నచ్చని ఫిలాసఫీతో వాదించి గెలవాలి కానీ అంతం చేస్తానంటే కుదరదు అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఎంపీలకు రాసిన లేఖను విడుదల చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీపీఐ సీనియర్‌ నేత నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌, కర్ణాటక రాజ్యసభ సభ్యుడు నసీర్‌ హుస్సేన్‌, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *