దేశానికి ర‌క్ష‌ణ‌గా మిష‌న్ సుద‌ర్శ‌న చ‌క్ర‌

– ఆపరేషన్‌ ‌సిందూర్‌తో పాక్‌ను దెబ్బతీసాం
– యువతకు పిఎం వికసిత్‌ ‌భారత్‌ ‌రోజ్‌గార్‌ ‌యోజన
-దీపావళి నుంచి జిఎస్టీ సవరణలు అమలు
– త్వ‌ర‌లో మేడిన్ ఇండియా  చిప్‌లు
– ఎర్ర‌కోట‌నుంచి ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగం

 ‌రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. భారత్‌ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా మిషన్‌ ‌సుదర్శన్‌ ‌చక్రను ప్రధాని మోదీ  ప్రకటించారు. వచ్చే పదేళ్లలో దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేయనున్న ఈ వ్యవస్థ కీలక ప్రదేశాలను కాపాడనుంది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని..ఇటీవలి ఆపరేషన్‌ ‌సిందూర్‌, ‌జిఎస్టీ, యువత కోసం కొత్త పథకం వంటి అనేక విషయాలను ప్రస్తావించారు. ఇది 140 కోట్ల మంది సంకల్ప పండగ అని, 75 ఏళ్లుగా రాజ్యాంగం మనకు మార్గదర్శనం చేస్తోందని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  శుక్రవారం ప్రధాని మోదీ న్యూదిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీనికిముందుగా త్రివిధ దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్‌ ‌వద్ద నివాళి అర్పించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ  ఇది సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం అని అన్నారు. కోట్ల మంది త్యాగాలతో మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. 75 ఏళ్లుగా రాజ్యాంగం మనకు మార్గదర్శనం చేస్తోందని, రాజ్యాంగ నిర్మాతల సేవలు మరువలేనివి అని అన్నారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీరజవాన్లకు సెల్యూట్‌ ‌చేస్తున్నామన్నారు. మన సైనికులు ఊహకందనంత దారుణంగా శత్రువులను దెబ్బతీశారని ప్రశంసించారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామ‌ని మోదీ అన్నారు. సుదర్శన చక్రం గురించి వివరిస్తూ ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారని ప్రధాని భరోసా ఇచ్చారు. మహాభారతంలోని శ్రీ కృష్ణుడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో దేశంలోని కీలకమైన మౌలిక వసతులను ముప్పు నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *