– కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమైంది
– విజయన్ మా సవాల్‌ను స్వీకరించి తెలంగాణ రావాలి
– కోవలం ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్
త్రివేండ్రం, ఏప్రిల్ 7: కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయం సాధించిందని, దానిని తాము అభినందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీలదని, ఎక్కడైనా మంచి జరిగితే అభినందిస్తామని చెప్పారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవలంలో యూడీఎఫ్ తరపున ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ హయాంలోని వైఫల్యాలను ఎత్తి చూపానంటూ ఆయన హయాం ముగిసిందని, 120 నెలల విజయన్ పాలనా కాలం వైఫల్యానికి ప్రతీకగా నిలిచిందని విమర్శించారు. విజయన్ వైదొలగే సమయం ఆసన్నమైందన్నారు. యూడీఎఫ్ మూడింట రెండొంతుల మెజారిటీతో గెలవబోతున్నదని జోస్యం చెప్పారు. ఊమెన్‌చాందీ తరహా పాలన అందిస్తామన్నారు. కేరళంలో సరైన అవకాశాలు లేకపోవడంతో యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారని, దాంతో ఇక్కడ వృద్ధులు చిన్న పిల్లలే కనిపిస్తున్నారంటూ ఇది దురదృష్టకరమని అన్నారు. విద్యావంతులు, నైపుణ్యం ఉన్న యువత విదేశాలకు వెళ్లడం సరికాదన్నారు. వాళ్లు ఇక్కడకు వచ్చి ఉపాధి పొందేలా చేస్తాం, తెలంగాణలో మాదిరే అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ నియామకాలు, స్వీయ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం వంటివి కేరళంలో అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. విజయన్‌తోపాటు కేరళం కమ్యూనిస్టు మహిళా నాయకులను తాను తెలంగాణకు ఆహ్వానిస్తున్నా.. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం.. ఏ మూలకైనా వెళ్లి తాము అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించవచ్చు అన్నారు. ఈ విషయంలో విజయన్‌కు సవాల్ విసురుతున్నా.. మేం 67 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.20,670 కోట్ల రుణ మాఫీ చేశాం.. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం.. 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నాం అని చెప్పారు. ఎన్నికలు కేరళం.. తెలంగాణ మధ్య కాదు యూడీఎఫ్.. ఎల్డీఎఫ్ మధ్య జరుగుతున్నాయి.. మేం ఏం చేస్తున్నామో అది చెబుతున్నాం.. మా సవాళ్లకు విజయన్ సమాధానం ఇవ్వాలి అని రేవంత్‌రెడ్డి కోరారు. ఈ సందర్భంగాఏఎన్‌ఐతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విజయన్ తనకు రాసిన లేఖలో 2014-23 మధ్య విషయాలను ప్రస్తావించారు.. ఆ కాలంలో పినరయి విజయన్ సన్నిహిత మిత్రుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు. ఆయన లేఖలోని తప్పులన్నీ జరిగినందునే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మార్చివేశారు.. ఇప్పుడు విజయన్‌ను కేరళం ప్రజలు మార్చివేస్తారు.. విజయన్‌పై శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్ కేసులున్నాయి అని గుర్తు చేశారు. విజయన్ గాడ్‌ఫాదర్ నరేంద్ర మోదీ దిల్లీలో ఉన్నారని, మోదీనే ఈ కేసులన్నింటి నుంచి విజయన్‌ను రక్షిస్తున్నారని విమర్శించారు. దేశం కోసం తమ జీవితాలను, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని రకరకాల కేసులతో వేధిస్తున్నారన్నారు. కేజ్రీవాల్ సహా అనేకమంది నేతలను ఈడీ కేసులతో వేధించి అరెస్టు చేసిన వాళ్లు ఎందుకు విజయన్ జోలికి రావడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ- విజయన్ మధ్య ఉన్న అవగాహనతోనే కేసులు, అరెస్టులు లేవు అని ఎద్దేవా చేశారు. మోదీ.. విజయన్ బంధాన్ని కేరళం ప్రజలు అర్ధం చేసుకున్నారు.. సరైన నిర్ణయం తీసుకుంటారు.. కేరళంలో మార్పు వస్తుంది అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


