సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వసూళ్ల దందా

– డాక్యుమెంట్లపై కొర్రీలు పెట్టి ముక్కుపిండి మరీ కలెక్షన్లు
– భువనగిరి కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులదే హవా
– చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్‌

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 29: జిల్లా కేంద్రంలోని భువనగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కలెక్షన్లే తమ ముఖ్యమైన ఎజెండా అన్నట్లు అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. కొత్త రూల్‌ పెట్టుకుని దస్తావేజుకు ఇంత ఇవ్వాల్సిందే అని ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులను కార్యాలయాల్లో పనులకు పురమాయిస్తూ వారిచేతే కలెక్షన్లు రాబడుతున్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారుల, సిబ్బంది పోకడ గురించి అటు ఉన్నతాధికారులు, ఇటు పాలకులు నోరు మెదపకపోవడం గమనార్హం. కార్యాలయంలో వెంకటేష్‌ అనే వ్యక్తి చాలా ఏండ్లుగా స్థిరపడిపోయాడు. ఆయనని చూస్తే ప్రైవేట్‌ వ్యక్తి అని ఎవరూ అనుకోరు. ఆయన కార్యాలయంలో ఎక్కడైనా కూర్చోవచ్చు.. ఎక్కడైనా తిరగొచ్చు.. ఏ ఫైల్‌ అయినా తిరిగేయవచ్చు.. అంతటి అధికారం ఆయనది. ఆఫీసులో ఉన్న ప్రతి ఫైల్‌ గురించి ఆయనకి తెలుసు.. అక్రమ వసూళ్లు అన్నీ ఆయన ద్వారానే జరుగుతాయి.. ఎంతమంది అధికారులు మారినా ఆయనను మాత్రం కార్యాలయం నుంచి బయటకు పంపే ధైర్యం చేయకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. కార్యాలయానికి వెళ్తే మొదటగా ఈయనే దర్శనమిస్తాడు. పని నిమిత్తం వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తిస్తాడు. కార్యాలయం షర్రాఫ్‌ ఉద్యోగి ఇంకోరకం. బ్యాంక్‌ రుణాల కోసం స్టాంపింగ్‌ కోసం అన్నీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసినా ఈసారు పైసలు ఇవ్వనిదే స్టాంపింగ్‌ చెయ్యడు.. పైగా సారు పైసలు డైరెక్ట్‌గా తీసుకోడు.. ఆయనకి ఆఫీసులో వినయ్‌, దేవేందర్‌ అనే ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులు అసిస్టెంట్లు. షర్రాఫ్‌ అక్రమ సంపాదనంతా వారి దగ్గరికే చేరుతుంది. వీరి బాగోతం బయటపడాలంటే వారి ఫోన్‌ పే, గూగుల్‌ పే పరిశీలిస్తే తెలుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. కార్యాలయంలో ఇంకో ఉద్యోగి వంద సైదులు అలియాస్‌ అటెండర్‌ సైదులు. ఈయనది మరో స్టైల్‌. రిజిస్ట్రేషన్‌ చేసుకునే వారి సంతకం వేలిముద్ర తీసుకొని డాక్యుమెంట్‌ నెంబర్‌ వేసి ఒక చిట్టీ రాసి ఇస్తాడు. డాక్యుమెంట్‌ ఇవ్వాలంటే వంద ఇవ్వాల్సిందే. లేదంటే సారు ఆగ్రహానికి గురి కావాల్సిందే. ఇలా రోజూ ఎన్ని డాక్యుమెంట్లు అయితే అన్ని వందలు ఈ అటెండర్‌ జేబులోకి వెళ్లాల్సిందే. ఇదంతా సాక్షాత్తు సబ్‌ రిజిస్ట్రార్‌ ఎదురుగానే జరుగుతుంది.
ప్ర‌జ‌ల‌ను పీడించి ఏం సాధిస్తారు
ప్రభుత్వ అధికారి లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అని గత ప్రభుత్వంలో చెప్పిన కేసీఆర్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉద్యోగులు లంచాలకు ఎగబడితే కర్రు కాల్చి వాత పెడతా అని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించినా లంచావతారులు మారకపోవడాన్ని, వారిపై ఎవరూ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైసా పైసా కూడబెట్టి ఎన్నో కలలుకని ఇండ్ల స్థలాలు కొంటుంటే రాబందుల్లా పీక్కుతింటున్న వీరు సాధించేదేమిటని నిలదీస్తున్నారు. తమ కష్టాన్ని దోచుకుంటున్న వీళ్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. నిజాయతీగా రిజిస్ట్రేషన్‌ చేయాల్సిన అధికారులు కొర్రీలు పెట్టి అడ్డగోలుగా డబ్బులు డిమాండ్‌ చేయడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *