– అధికారులకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 12 : భారీ పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు, కార్మికుల భద్రతకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, చర్యలపై స్పష్టమైన ఒక మాన్యువల్‌లను సిద్ధం చేయాలన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన దుర్ఘటనపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను సంబంధిత అధికారులతో సీఎస్ గురువారం సమీక్షించారు. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల, బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు, కోర్టు కేసుల పురోగతిపై సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ, మధ్యతర, చిన్నతరహా పరిశ్రమలలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలలో వివిధ విభాగాలు సమన్వయంతో తనిఖీలు నిర్వహించడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ (ఉమ్మడి తనిఖీ బృందాలు) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు రెగ్యులర్ మానిటరింగ్ ఉండేలా తనిఖీ నిర్వహించాలన్నారు. జిల్లాస్థాయిలో రెవెన్యూ, పోలీస్, పరిశ్రమలు, కార్మిక, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి శాఖల అధికారులతో కూడిన తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఆ వివరాలను ఆన్లైన్లో (డాష్ బోర్డ్) పొందుపరిస్తే అన్ని విభాగాల అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు, భద్రతా ఆడిట్, అలాగే కార్మికుల భద్రతకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సంజయ్ కుమార్, దాన కిషోర్, ఫైర్ సర్వీస్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ్య, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ రవి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





