పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలి

– విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించం
– ప్రకటనల ఆదాయం పెంపుపై కసరత్తు చేయాలి
– మల్టీ లెవల్ పార్కింగ్, స్కైవాక్, మార్కెట్లపై అధ్యయనం చేయండి
– నూతన మేయర్లు, మున్సిప‌ల్‌ చైర్మన్లతో త్వరలో సమావేశం
– పురపాలక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: హైదరాబాద్‌లోని మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాను ప్రత్యక్ష పరిశీలనకు వస్తానని, ఎక్కడైనా చెత్త కనపడితే సహించమని అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి నగరపాలక సంస్థల కమిషనర్లు తెల్లవారుజామున ఆరు గంటలకే క్షేత్ర పర్యటనలు చేయాలని ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రకటనల ఆదాయం పెంపు పాలసీపై సమీక్షించారు. ట్రాఫిక్ బాగా ఉన్నచోట పీపీపీ విధానంలో స్కైవాక్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆదాయం పెంపునకు తీసుకోవాల్సిన పలు అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. నగరంలో కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్, ఇతర కేబుళ్లు, సీసీ కెమెరాలు, ప్రకటనల బోర్డులు వాటిపై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ప్రకటనలకు సంబంధించి పెద్ద మొత్తంలో వివిధ రకాల బోర్డులు కనిపిస్తున్నా ఆశించిన ఆదాయం రాకపోవడంపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. ముంబయి, అహ్మదాబాద్, బెంగళూరుల్లోని ప్రకటనల ఆదాయంతో నగరంలో వస్తున్న ఆదాయాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న ప్రకటనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రకటనలకు 10 శాతం బోర్డులు కేటాయించాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా పీపీపీ, ఇతర నమూనాల్లో ఆదాయం సమకూర్చుకునే అంశంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దానిని పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు, సలహాలు అందజేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు భూముల్లోనూ మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నెక్లెస్ రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. మూడు నగర పాలక సంస్థలతోపాటు రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ సిస్టమ్ అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు నగర పాలక సంస్థల పరిధిలోని పార్కుల వివరాలు సేకరించాలని.. వాటి అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు.

కొత్త పాలకవర్గాలకు ఒక రోజు శిక్షణ

రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిప‌ల్‌ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లతో ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలను వివరించాలని సూచించారు. తాను సమావేశానికి హాజరై నూతనంగా ఎన్నికైన వారితో మాట్లాడాతానన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, సృజన, వినయకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డాటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయండి

డాటా సెంటర్లకు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలు.. వారికి అవసరమైన భూమి, ఇతర వసతులపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. డాటా సెంటర్లకు భూ కేటాయింపులో హేతుబద్ధత ఉండాలని సీఎం సూచించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంటర్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సాగుతున్న భూ సేకరణపైనా ఆరా తీశారు. భూ పరిహారం నిర్ణయం విషయంలో ఉదారంగా ఉండాలని సీఎం సూచించారు. రైతులను పిలిచి మాట్లాడి వారు సంతృప్తి చెందేలా పరిహారం నిర్ణయించాలన్నారు. రూ.వేల కోట్లతో పెట్టుబడులు పెట్టే సంస్థలు భూమిపై పెట్టే పెట్టుబడి చాలా స్వల్పమన్నారు. కంపెనీలకు సకాలంలో భూమి, ఇతర వసతులు అందుబాటులో ఉంచితే త్వరగా పనులు పూర్తి చేసుకుంటారని సీఎం అభిప్రాయపడ్డారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *