– మద్యం మత్తులో తోటి విద్యార్థి వీరంగం
బూర్గంపాడు, ప్రజాతంత్ర ఆగస్టు 30: మండల పరిధిలోని ఉప్పుసాక ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్థిపై దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన విద్యార్ధిపై సారపాకకు చెందిన మరో విద్యార్ధి మద్యం సేవించి వచ్చి దాడికి పాల్పడ్డాడు. పాఠశాల హెచ్ఎం, వార్డెన్లు విద్యార్థుల పట్ల అశ్రద్ధ చూపడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ సంఘటన చోటుచేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో గణేష్ మండపం ఏర్పాటు చేసుకోగా దానికి సంబంధించిన పూజా సామాగ్రి నిమిత్తం పాఠశాల కంప్యూటర్ ఆపరేటర్తో పాటు 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను శుక్రవారం సాయంత్రం హెచ్ఎం అనుమతితో బయటకు పంపడంతో కంప్యూటర్ ఆపరేటర్ వారితో కలిసి పాల్వంచ వెళ్లారు. అక్కడ పూజా సామాగ్రి తీసుకున్నాక ఆ ఇద్దరు టాయ్‌లెట్ కువెళ్లాలని చెప్పి ఆయన కళ్లుగప్పి మద్యం బాటిల్ కొనుగోలు చేసి పూజా సామాగ్రి కవర్లో పెట్టి తిరిగి హాస్టల్కు చేరుకున్నారు. అయితే రాత్రి సమయంలో గణేష్ మండపం వద్ద అప్పటికే మద్యం సేవించి ఉన్న విద్యార్ధి తోటి విద్యార్ధి అక్కడకు చద్దర్(దుప్పటి) కోసం రావడంతో ఏమీ అనకుండానే అతని మెడ, ముఖంపై దాడిచేశాడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థి వార్డెన్కు చెప్పడంతో ఆమె హెచ్ఎంకు సమాచారం అందించింది. తాను హాస్టల్ లో ఉండను ఇంటికి వెళతానని చెప్పగా హెచ్ఎం రాత్రి సమయంలో ఎందుకు ఉదయం పాఠశాలకు వచ్చాక నేను మాట్లాడి పంపుతానని చెప్పడంతో ఆ విద్యార్థి వసతి గృహంలోనే ఉండి తనపై దాడి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. శనివారం ఉదయం దాడికి గురైన విద్యార్ధి మేనమామ వసతిగృహం వద్దకు చేరుకోగా అప్పటికే దాడిచేసిన విద్యార్ధి తల్లిదండ్రులను పాఠశాలకు హెచ్ఎం పిలిపించినట్లు తెలిసింది. తమ పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుంటారని వసతిగృహం, పాఠశాలకు పంపితే బయటకు అనుమతి లేకపోయినా ఎలా వెళుతున్నారని, వారికేమైనా జరిగితే బాధ్యత ఎవరిదని తల్లిదండ్రుల మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఇదే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కారణంగా టీసీ ఇచ్చి పంపిన సంఘటన సైతం నిర్వాహకుల పనితీరును ఎత్తిచూపుతోంది.
—————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




