– ఎన్‌ఎస్‌పీ మెయిన్, మేజర్ కాల్వలకు పూర్తిస్థాయి మరమ్మతులు
– త్వరితగతిన ఎత్తిపోతల పథకాల పూర్తికి ప్రణాళికలు
– కాంగ్రెస్ హయాంలో 3.17కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం
– ధాన్యం కొనుగోలులో సరికొత్త రికార్డు
– బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు
– అన్నింటినీ తట్టుకు యోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారు
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మిర్యాలగూడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్‌తోపాటు దానికి అనుబంధంగా ఉన్న మేజర్ కాలువలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహిస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే పోరాటం చేసి కృష్ణా జలాశయాలలో రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిర్యాలగూడలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ఎత్తిపోతల పధకాలన్నింటినీ సంవత్సరాంతంలో పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని, 2021 ఫిబ్రవరి 10న అట్టహాసంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన జరపడంతోపాటు సంవత్సరంన్నరలో పూర్తిచేస్తామని ప్రగల్భాలు పలికారని, ప్రభుత్వం దిగిపోయేనాటికి పట్టుమని 5% పనులు కూడా పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కృష్ణా నదిపై 25వేల ఎకరాల ఆయకట్టుతో నెల్లికల్లు, 8,000 ఎకరాలతో బొత్తలపాలెం,2 ,500 ఎకరాల ఆయకట్టుతో వీర్లపాలెంలతోపాటు దున్నపోతుల గండి, తోపుచర్ల, కేశావాపురం ఎత్తిపోతల పథకాల పనులన్నీ వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతోపాటు స్థానిక లోకసభ సభ్యులు,శాసనసభ్యుల తోడ్పాటుతో త్వరితగతిన పూర్తి చేస్తామని పునరుద్ఘటించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, నిరుపేదల కళ్ళలో వెలుగులు నింపాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని ఆయన సుస్పష్టం చేశారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర జనాభాలో 85% జనాభాకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. బీఆర్.ఎస్ పాలనలో అర్హులైన నిరుపేదలను విస్మరించడంతోపాటు అప్పటికే ఉన్న తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో అవి తినడానికి లబ్ధిదారులు విముఖత చూపడంతో పక్కదారి పట్టాయని చెప్పారు. మిర్యాలగూడ పురపాలక సంఘం పరిధిలో 96 వేల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని ఈ నియోజకవర్గంలోని 90% రైతాంగం వరి పంట మీద ఆధారపడి ఉంటారని, ఇక్కడ అదేస్థాయిలో వెలిసిన రైస్ మిల్లుల పరిశ్రమ ఆసియా ఖండంలోనే అతి పెద్దదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చా¿క కృష్ణా బేసిన్‌లో ధాన్యం సేద్యంతోపాటు దిగుబడి, కొనుగోలుపెద్దమొత్తంలో పెరిగిందని చెప్పారు. బీఆరఎస్ పాలనలో లక్షమంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్షా 75 వేల మంది రైతుల దగ్గర కొనుగోలు చేశామని చెప్పారు. వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలతోటే ఈ అద్భుతమైన ఫలితాలు రాబట్టామని గణాంకాలతో వివరించారు. కాంగ్రెస్ పార్టీకి మిర్యాలగూడ కంచుకోట అని, అయితే బీఆరఎస్ పాలనలో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడ్డారని ఉత్తమ్ విమర్శించారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంనుండి బీఆర్ఎస్ అభ్యర్థికి 40 వేల మెజారిటీ వస్తే అనతి కాలంలోనే లోకసభకు జరిగిన ఎన్నికల్లో తనకు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ లీడర్, కేడర్ 7,000 మెజారిటీ నిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అతి తక్కువ కాలంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన మార్పు మిర్యాలగూడ నాటి బీఆర్ఎస్ పాలకుల పరాకాస్ట పాలనకు అద్దం పడుతుందని విరుచుకుపడ్డారు. అలాంటి పాలనలో విసిగి వేజారిన కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అప్పటి బీఆర్ఎస్ పాలకులను వీరోచితంగా ఎదుర్కొని తిరిగి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా తీర్చి దిద్దారని ఆయన చెప్పారు. అదే వరవడిని పురపాలక సంఘం ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి ఉత్తమ్ పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




