- విజయ డైరీకి ఆధునికీకరణ
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పాడి పంటలను ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి మంగళవారం ఖమ్మం విజయ డైయిరీ యూనిట్ తనిఖీ చేసి,15వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం 1975 లో విజయ డైయిరీ యూనిట్ ప్రారంభమైందని, ప్రస్తుతం ఆ భవనం వెంటనే రినోవేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయ డైరీ యూనిట్ లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, మంచి నీరు కూడా మున్సిపాలిటీ నుంచి సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.విజయ డైరీ చుట్టుపక్కల కాలనీలోని డ్రైన్లు సంస్థలోకి వస్తున్నాయని, దీని కోసం డ్రైన్ డైవర్షెన్, కాంపౌండ్ వాల్ నిర్మాణంపై కార్యాచరణ చేయాలని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాలో విజయ డైరీ చిల్లింగ్ యూనిట్ల ఆధునీకరణ కోసం కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.మన రాష్ట్రంలో పాడి ఉత్పత్తులు తగ్గి పోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి పాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, యూరియాతో తయారు చేసే కల్తీ పాలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ పెరగాలని మంత్రి తెలిపారు.
విజయ డైరీ ఆధునీకరణ, ఖర్చు తగ్గించి ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, విజయా డెయిరీ సమస్యలపై అధికారులతో సమీక్ష చేస్తామన్నారు. నీటి సరఫరా, సానిటేషన్ పై చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. భవనం పాతది కావడంవల్ల, ప్రత్యామ్నాయంగా ఎక్కడికైనా మార్చవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. టైం బౌండ్ కార్యాచరణ ప్రణాళిక చేసి విజయా డెయిరీ కి పూర్వ వైభవం తెస్తామన్నారు.తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండి చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాడి, పంట ఉన్న గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని అన్నారు. పంటతో పాటు పాడి ఉంటేనే గ్రామాలు కళకళలాడుతున్నాయని, ప్రైవేట్ అమూల్, హెరిటేజ్ కంటే మెరుగైన ధరలను విజయ డైరీ ద్వారా పాడి రైతులకు అందిస్తున్నామని, ప్రతి రోజూ 5 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తున్నామని అన్నారు.
10 ఎస్.ఎన్.ఎఫ్ వస్తే రూ.85లు దేశంలో అధిక రేటు అందిస్తున్నామన్నారు. ప్రతి రోజూ 50 వేల లీటర్ల పాలు సంక్షేమ శాఖ ద్వారా తల్లులకు, 50 వేల లీటర్ల పాలు పిల్లలకు అందిస్తున్నామని అన్నారు. 20 వేల లీటర్ల పాలు ప్రాసెస్ చేసుకునేలా నూతన ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. పాత ప్లాంట్ కు నీటి సరఫరా చేయగలిగితే మెరుగ్గా పని చేస్తామని అన్నారు.అనంతరం మంత్రి కొత్తగూడెం ఎస్సీ కాలనీలో రూ. 75 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు, ఖమ్మం నగరం 15వ డివిజన్ లోనీ కొత్తగూడెం వెటర్నరీ హాస్పిటల్ రోడ్డులో రూ. 25 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. లబ్దిదారులకు క్రొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు, ఖమ్మం ఆర్డిఓ నర్సింహరావు, విజయా డెయిరీ డిడి రవికుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే