– అంతర్గత ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నాం
– మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: వారం రోజులుగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రజల్లో భయాందోళనలను కలిగించాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వాస్తవానికి ఈ ఇంధన సమస్య మన రాష్ట్రానికి లేదా దేశానికి మాత్రమే పరిమితమైనవి కావని, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో మనం ఇతర దేశాలపై ఆధారపడుతున్నందున ప్రపంచ పరిస్థితుల ప్రభావం మన దేశంపై కూడా పడుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటోందని, దేశంలో అంతర్గతంగా జరుగుతున్న ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచుతూ అవసరమైన ఇంధనాన్ని దేశంలోనే అందించే దిశగా కృషి జరుగుతోందని వివరించారు. విదేశాల నుండి రావాల్సిన పెట్రోలియం ఉత్పత్తులను కూడా విజయవంతంగా దిగుమతి చేసుకునే విధంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సమయంలో భారత ప్రభుత్వం ప్రతి రోజూ అనేక దేశాల నాయకులతో చర్చలు జరుపుతోందని, కొరత లేకుండా చూసేందుకు ఇతర దేశాలు నిర్ణయించిన ధరలను చెల్లించి అయినా సరే పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులను దేశానికి తీసుకురావడంలో కట్టుబడి ఉందని చెప్పారు. మన దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, ప్రజల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, గతంలో కట్టెలు, కిరోసిన్ వంటి ఇంధనాలను ఉపయోగించిన ప్రజలు, ఇప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్పీజీ గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారన్నారు. ‘ఉజ్వల పథకం’ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, చిన్న రైతులు కూడా గ్యాస్ సిలిండర్లను పొందగలిగారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తూ, రైల్వేలను విద్యుదీకరణ చేస్తూ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పారు. సమాచారం పంచుకోవడంలో సోషల్ మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో తప్పుడు ప్రచారం ప్రజల్లో భయాందోళనలను పెంచుతోందని అన్నారు. పెట్రోల్ కొరత ఉందనే వదంతులు అనవసరమైన రద్దీకి దారితీసాయన్నారు. ఆయిల్ కంపెనీల అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినట్లు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ కొరత ఏమీ లేదన్నారు. దేశవ్యాప్తంగా సరఫరాలు సక్రమంగా కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అందువల్ల వదంతులను నమ్మకుండా, బాధ్యతతో వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





