– స్త్రీ నిధి కార్యకలాపాలపై మంత్రి సీతక్క సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: స్త్రీ నిధి రుణాలు, వసూళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా హెచ్చరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ముఖ్య వేదికగా నిలిచిన స్త్రీ నిధి సంస్థ కార్యకలాపాలపై సచివాలయంలో సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో స్త్రీ నిధి ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1947 కోట్ల రుణాలు పంపిణీ చేయగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటికే రూ.2064 కోట్ల రుణాలు అందజేసినట్లు అధికారులు వివరించారు. తక్కువమంది సిబ్బంది ఉన్నప్పటికీ రుణ ప్రణాళికలో దాదాపు 90 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. గత ఏడాది 78 శాతం రికవరీ సాధించగా ప్రస్తుత సంవత్సరం 72 శాతం రికవరీ నమోదైందని, సెర్ప్, మెప్మా సిబ్బంది సమన్వయంతో 85 శాతం రికవరీ లక్ష్యంతో క్షేత్రస్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. స్త్రీనిధి స్థాపన నుంచి ఇప్పటివరకు పారదర్శకంగా పనిచేస్తున్నందున అనేక బ్యాంకులు సంస్థకు రుణాలివ్వడానికి ముందుకొస్తున్నాయని అధికారులు తెలిపారు. గతంలో అవకతవకలకు పాల్పడిన 16మంది సిబ్బందిని తొలగించినట్లు వెల్లడించారు. సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది 163 మంది సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు. సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రగతి ఆధారిత ప్రోత్సాహకాలు (పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్) ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల కొన్ని పత్రికల్లో స్త్రీనిధి కార్యకలాపాలపై వచ్చిన కథనాలపై మంత్రి సీతక్క ప్రత్యేకంగా చర్చించి వాటిలో ప్రస్తావించిన అంశాలపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు ఎక్కడైనా నిర్ధారణ అయితే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్త్రీ నిధి సంస్థ పేద మహిళలకు ఆర్థిక అండగా నిలుస్తూ వేలాది కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరుస్తోందని మంత్రి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితేనే సమాజ అభివృద్ధి సాధ్యమని, ఇందిర మహిళా శక్తి వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. స్త్రీనిధి కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగాలని అధికారులకు మంత్రి సూచించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సంస్థపై తప్పుడు ప్రచారాలు జరిగితే వాటిని తక్షణమే ఖండిస్తూ సరైన సమాచారం ప్రజలకు అందించాలని ఆదేశించారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





