– వడ్డీ లేని రుణాలపై స్త్రీనిధి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న వడ్డీ లేని రుణాలలో మొదటి ప్రాధాన్యత స్త్రీ నిధి రుణాలకు ఇవ్వాలని స్త్రీనిధి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. తద్వారా మహిళల్లో సంస్థపై మరింత ఆత్మవిశ్వాసం పెరిగి సంస్థ బలపడటానికి దోహదపడుతుందని వారు వివరించారు. సచివాలయంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు సంస్థ నుంచి వైదొలగిన ఉద్యోగులు స్వార్ధపూరితంగా నిరాధారమైన దుష్ప్రచారాన్ని చేస్తున్నారని, వారి తప్పుడు ప్రచారం వల్ల రుణ చెల్లింపులు తగ్గిపోయాయని ఫిర్యాదు చేశారు. సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా కొంతమంది పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. సంస్థను బద్నాం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి దృష్టికి తేగా వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు.


