ఐటీడీఏల బలోపేతంపై దృష్టి

– కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్క్‌షాప్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఐటీడీఏల బలోపేత చర్యలపై కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకు చెందిన గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ, సంక్షేమ శాఖ హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో శనివారం ఒక రోజు కార్యశాల(వర్క్‌షాప్) నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ వర్నాలి డేకా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశాన్ని గిరిజన సాంస్కృతిక – శిక్షణ సంస్థ సంచాలకురాలు డాక్టర్ వి.సముజ్వల వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీడీఏల ప్రస్తుత పరిస్థితి, వాటి బలోపేతం, విభిన్న రాష్ట్రాలలో అమలు అవుతున్న విధానాలలో తేడాలు, నిధుల వినియోగ విధానాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఐటీడీఏల ద్వారా విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, మౌలిక వసతుల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, యువతకు శిక్షణ, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తించారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా యువతకు శిక్షణ అందించడంపై చర్చ జరిగింది. గిరిజన హక్కుల పరిరక్షణ, అటవీ హక్కుల చట్టం (ఎఫఆరఏ) అమలు, భూమి సమస్యల పరిష్కారం, వలసల నియంత్రణ వంటి అంశాలపై కూడా సమగ్రంగా చర్చించారు. గ్రామ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. గిరిజన విద్యాభివృద్ధిలో భాగంగా స్థానిక భాషలలో ప్రాథమిక విద్య, కెరీర్ గైడెన్స్, ఆశ్రమ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కొన్ని ప్రాంతాలలో 100% ఎస్సెస్సీ ఫలితాలు సాధించిన ఉత్తమ పద్ధతులను ఇతర ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. అంతేకాక గిరిజన సహకార సంస్థల ద్వారా పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, విత్తనాలు, ఎరువుల విక్రయ కేంద్రాల ఏర్పాటు, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా జీవనోపాధి కార్యక్రమాల అభివృద్ధిపై చర్చించారు. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ బలోపేతం, విభాగాల మధ్య సమన్వయం, నిధుల సులభ విడుదల, పరిపాలనా సామర్థ్యం పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఉత్తమ పద్ధతులను గుర్తించి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి మే నెలలో జాతీయ వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు విట్టా సర్వేశ్వర్ రెడ్డి, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకుడు డాక్టర్ వేమూరి సముజ్వల, సంయుక్త సంచాలకురాలు సంధ్యారాణి, ఏపీ గిరిజన సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకురాలు హేమలత, ఇరు రాష్ట్రాల ఐటీడీఏ పీవోలు, ఉప ప్రాజెక్టు అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *