విద్యా రంగం బలోపేతానికి కేంద్రం కృషి

– కేంద్ర, రాష్ట్ర విభాగాలతో ‘దిశ’ సమావేశం
– పౌర సేవలపై సమీక్ష నిర్వహించాం
– మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, అలాగే స్మార్ట్ క్లాసులు, డిజిటల్ క్లాసులు వంటి సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం శుక్రవారం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అన్ని శాఖలు ప్రజలకు అందిస్తున్న పౌరసేవలపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. ముఖ్యంగా విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సరఫరా వంటి అనేక అంశాలపై జరుగుతున్న పనులను సమీక్షించామన్నారు. ఈ సమావేశం చాలా ఉపయోగకరంగా జరిగిందన్నారు. వైద్య రంగం బలోపేతం కోసం చర్యలు తీసుకుంటున్నామని, హైదరాబాద్‌లోని హాస్పిటల్స్‌లో డయాలిసిస్ సెంటర్లు, వ్యాక్సినేషన్ సదుపాయాలు, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, ఇవన్నీ సమర్థంగా అమలు అవుతున్నాయా లేదా అన్నదానిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. వచ్చే మూడు నెలల కార్యాచరణపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించామన్నారు. హైదరాబాద్ ఒక స్టేట్ కేపిటల్‌గా, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని, దీనికి అవసరమైన తాగునీటి సమస్యల పరిష్కారం, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సంక్షేమం వంటి అన్ని అంశాలపై దృష్టి సారిస్తున్నామని, అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రతి సమస్యపై చర్చించి పరిష్కార మార్గాలు కనుగొంటున్నామని వివరించారు. వేసవి నేపథ్యంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని, జీహెచఎంసీ, మెట్రో వాటర్, విద్యా శాఖలు కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని, పిల్లలకు పాఠశాలల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని విద్యా శాఖకు సూచించామన్నారు. అదేవిధంగా వర్షాకాలానికి ముందస్తు ఏర్పాట్లపై కూడా దృష్టి పెట్టామని, డ్రైనేజీ సిస్టమ్, పైప్‌లైన్స్, ఓపెన్ నాలాలు, వరద నీటి ప్రవాహ మార్గాలు వంటి వాటిని సమీక్షించి అవసరమైన మరమ్మతులు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని మాన్యువల్స్, వ్యవస్థలను చెక్ చేయాలని సూచించామన్నారు. రవాణా శాఖతో కలిసి హైదరాబాద్‌లో కొత్త ఆడిటోరియం నిర్మాణంపై కూడా చర్చించామని, ఆ ప్రదేశాన్ని శనివారం పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కిషన్‌రెడ్డి తెలిపారు. నగర అభివృద్ధి కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నామన్నారు. హైదరాబాద్ ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఐటీ హబ్‌గా ఉందని, ఇది మరింతగా పరిశోధనలో అభివృద్ధి చెందాల్సి ఉన్నందున నేషనల్ సైన్స్ సెంటర్‌ను కూడా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేకాక ఇక్కడ అనేక రకాల టూరిజం అవకాశాలు ఉన్నందున టూరిజం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, అనేక కొత్త ఇన్‌స్టిట్యూషన్స్‌ను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి అనేక ప్రాజెక్టులు తీసుకొస్తున్నామని, హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణే నగరాలకు ీVౖ ²స్పీడ్ రైలు, ఎలివేటెడ్ కారిడార్‌లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని కూడా వివరించారు. ఇవి తెలంగాణ అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ప్రకటించిన ఏడు హై స్పీడ్ రైల్ కారిడార్లలో మూడు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని అభివృద్ధి చెందడం తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు లభించిన గొప్ప గుర్తింపు అని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకారం ప్రతిపాదనలు పంపిస్తే వాటిని కేంద్రం ఆమోదిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం అమలు చేస్తే మంచి ఫలితాలు సాధించగలమని అన్నారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, మెట్రో వాటర్ బోర్డు అధికారులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ, ఐఐటీ మధ్య ఎంవోయూ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి సమక్షంలో ఐఐటీ- హైదరాబాద్, ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (ఎసఎస్‌సీటీయూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి. ఎసఎస్‌సీటీయూ వీసీ ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త పాఠ్య ప్రణాళికలను రూపొందించనున్నారు. అలాగే అధ్యాపకులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించి సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు. ఎసఎస్‌సీటీయూలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రయోగశాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు ఇంటర్న్‌షిప్, వర్క్‌షాప్, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించి విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాలను మెరుగుపరచనున్నారు. అదనంగా, ఎసఎస్‌సీటీయూ అధ్యాపకులకు ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక శిక్షణ అందించనుంది. బోధనలో మెళకువలు పెంపొందించేందుకు కార్యశాలలు, సెమినార్లు, అతిథి ఉపన్యాసాలను నిర్వహిస్తారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి సాంకేతిక కోర్సుల నిర్వహణకు ఐఐటీ హైదరాబాద్ సహకారం అందిస్తుంది. ఈ క్రమంలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్‌లో బీఎస్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ బీఎస్ వంటి కోర్సులు ప్రారంభించనున్నారు. ఈ కోర్సులను బోధించే అధ్యాపకులకు శిక్షణ బాధ్యతను ఐఐటీ హైదరాబాద్ చేపడుతుంది. ఐఐటీ హైదరాబాద్ మార్గదర్శకత్వంలో నిర్వహించే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందుతూ ప్రాంతీయ విద్యాభివృద్ధికి దోహదం చేయనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *