– ప్రభుత్వానికి డీటీఎఫ్ వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను గుణాత్మకంగా మార్చగల సమర్థులైన టీచర్లను తయారు చేసే డైట్ వంటి సంస్థలు నేడు తీవ్రమైన అధ్యాపక కొరత, మౌలిక సదుపాయాల లేమితో చతికిలపడుతున్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయ విద్యా సంస్థలు(డైట్), కాలేజెస్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (సీటీఈఎస్), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లలో నెలకొన్న తీవ్రమైన సంక్షోభాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని పది డైట్‌లలో తొమ్మిదింటికి రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేరు. నాలుగింటిలో ఒక్క రెగ్యులర్ అధ్యాపకుడు కూడా లేడు. మిగతావి ఒకరు లేదా ఇద్దరు రెగ్యులర్ సిబ్బందితో మాత్రమే నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క ఐఏఎస్ఈ కేవలం ఒక అధ్యాపకుడు, ఒక ప్రిన్సిపాల్‌తో నెట్టుకొస్తోంది. మిగిలిన ఉద్యోగాలన్నింటిలో పది నెలల స్వల్ప వేతనంపై పనిచేసే ఒప్పంద అతిథి అధ్యాపకులే ఉన్నారు.
అధ్యాపక కొరత వల్ల ప్రీ-సర్వీస్ విద్య, ఇన్-సర్వీస్ శిక్షణ, పరిశోధన, పాఠశాలలకు అకడమిక్ సహాయం మొదలైనవి బలహీనపడిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీఈఐలను పునర్నిర్మించి ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (డీఐఈఆర్‌టీ)గా విలీనం చేయాలని డీటీఎఫ్ ప్రతిపాదించింది. ఇవి విశ్వవిద్యాలయస్థాయి అకడమిక్ కేంద్రాలుగా పనిచేస్తూ మూడు దశలలో ఉపాధ్యాయ విద్యను అందించాలి. దశ-1 ప్రీ-ప్రైమరీ/పునాదిస్థాయి (3 నుండి 7 సంవత్సరాల పిల్లలకు, ఈసీసీఈ 1వ-2వ తరగతులు, డిగ్రీ అర్హత), దశ-2 ప్రాథమికస్థాయి (8 నుండి 12 సంవత్సరాల పిల్లలకు, 3-7వ తరగతులు, డిగ్రీ అర్హత); దశ-3 మాధ్యమికస్థాయి (13 నుండి 17 సంవత్సరాల పిల్లలకు, 8-12వ తరగతులు, పీజీ అర్హత) అకడమిక్ గుణాత్మకతను పెంపొందిస్తూ కొనసాగించడానికి ప్రతి డీఐఈఆర్‌టీలోనూ భాషలు, గణితం, విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, ఈసీసీఈ, విద్యా సాంకేతిక పరిజ్ఞానం, సమ్మిళిత విద్య మొదలైన విభాగాలకు ప్రతి దశలోనూ ప్రత్యేక విభాగాలు ఉండాలి. ప్రతి విభాగంలో కనీసం నలుగురు అధ్యాపకులు ఉండాలి. అన్ని డీఐఈఆర్‌లకు పరిశోధన అనుభవం ఉన్న పీహెచ్‌డీ చేసిన ప్రిన్సిపాల్‌లు నేతృత్వం వహించాలి. ఈ పునర్నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ప్రభుత్వం ఎన్‌సీటీఈతో నిరంతరం సంప్రదింపులు జరపాలి. సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి, టీఈఐ అధ్యాపకులందరూ ప్రతి సంవత్సరం 20 రోజులు పూర్తి పాఠశాల వేళాపట్టిక మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా బోధించే ‘క్షేత్రస్థాయిలో పనిచేయడం’ పనిచేసే విధానం అమలు చేయాలని డీటీఎఫ్ సూచించింది. అంతేకాక తరగతి గదులు, ప్రయోగశాలలు, భౌతిక, డిజిటల్ గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాలు, హాస్టళ్ళు, సిబ్బంది నివాసాలతో కూడిన విశాలమైన క్యాంపస్‌లు నిర్మించాలని కూడా కోరింది. టీఈఐలు, ఉపాధ్యాయుల వృత్తిపరమైన ఎదుగుదలతో అనుసంధానమైన సృజనాత్మక, పరిశోధనాధారిత కార్యక్రమాలు అందించే నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి (సీపీడీ) కేంద్రాలుగా పనిచేయాలి. అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అకడమిక్ విభాగాలను పటిష్టపరచాలని, పరిశోధన సంస్కృతిని ప్రోత్సహించాలని, మౌలిక సదుపాయాలను ఆధునికీకరించాలని డీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. డైట్స్, సీటీఈ, ఐఏఎసఈలను బలోపేతం చేయడం అనేది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యను కాపాడటానికి, మెరుగుపరచడానికి అత్యంత కీలకమైన అడుగని డీటీఎఫ్ అభిప్రాయపడింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




