– అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోని రాష్ట్రం
– జమ్మికుంటలో ఆధునిక వైద్య పరికరాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి
కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబరు 24: పేదలు అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్స్‌ను విశ్వసించి వొస్తారని, ఆ నమ్మకాన్ని పెంపొందించే దిశలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అవకాశాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నదని విమర్శించారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో రూ.1.50 కోట్ల సిఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో వైద్య సేవల బలోపేతంపై దృష్టిపెట్టాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సరైన సౌకర్యాలు లేక పేదలకు నమ్మకం తగ్గిపోతున్నదని, ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు సీఎస్సార్ నిధుల ద్వారా రూ.5 కోట్లు అందజేసి ఆధునిక పరికరాలను తీసుకురావడంలో విజయవంతమయ్యామని చెప్పారు. ఆసుపత్రిలో పోస్టుమార్టం రూమ్, ఎక్స్‌రే మిషన్‌తో పాటు అవసరమైన ఇతర పరికరాలను ఎంపీ నిధుల ద్వారా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. పరికరాల లేమి పేరుతో పేద రోగులను కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కి రిఫర్ చేయొద్దని వైద్యులకు సూచించారు. సేవా దృక్పథంతో పనిచేస్తే ప్రజల్లో ప్రభుత్వ హాస్పిటల్స్‌పై మంచి విశ్వాసం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలోని చెక్‌డ్యాంల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని సంజయ్ ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుందని, ప్రణాళిక లేకుండా చెక్‌డ్యాంలను నిర్మించారని పేర్కొన్నారు. ఆ కాంట్రాక్టర్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారని అన్నారు. చెక్‌డ్యాంలపై విచారణ జరిపించి అవినీతి నిర్దారణ అయితే కాంట్రాక్టర్ల నుంచి నిధులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను పూర్తిగా ఆధునీకరించేందుకు త్వరలో ప్రపోజల్స్ పంపుతామని, జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




