– మహిళల సాధికారతకు ప్రాధాన్యత
– 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి చీర
– ఆత్మకూరు, అమరచింత మండలాలకు 1400 ఇందిరమ్మ ఇళ్లు
– కృష్ణా నదిపై హైలెవెల్ వంతెన
– 60 ఏళ్ల కల సాకారం
– మంత్రి వాకిటి శ్రీహరి
వనపర్తి, ప్రజాతంత్ర, నవంబర్ 22: గతానికి ఇప్పటికీ వున్న తేడాను మహిళలు గుర్తించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగ శనివారం అమర్చింత, ఆత్మకూరు మండలాలకు సంబంధించిన మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం ఆత్మకూరు పట్టణంలోని సాయి తిరుమల ఫంక్షన్ హాల్లో నిర్వహించగా మంత్రి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో మహిళా సంఘాల్ని నిర్వీర్యం చేశారని మళ్లీ ప్రజా ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాలను బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వంలో దురదృష్టవశాత్తు మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వారు తీసుకున్న రుణాన్ని తిరిగి వసూలు చేసే వారని, కానీ ప్రజా ప్రభుత్వంలో మహిళ ప్రమాద వశాత్తూ చనిపోతే తీసుకున్న రుణం మాఫీ చేయడంతో పాటు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్పారు. పావలా వడ్డీ రుణాలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి లు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల పనులు అప్పగించామన్నారు. పెట్రోల్ పంపులు, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సులకు యజమానులు, మహిళా శక్తి క్యాంటీన్ లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పేదలకు తెల్ల రేషన్ కార్డులు , సన్న బియ్యం, వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు కుటుంబ బాధ్యతలు తీసుకుంటారని ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మహిళలకే ఇస్తున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి మహిళా సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళకు ఇస్తున్న చీరలు చాలా నాణ్యమైనవని అన్నారు.
కృష్ణా నది పై హై లెవల్ వంతెన నిర్మించి రాకపోకలు సాగించాలని 60 ఏళ్ల కల త్వరలో సాకారం కాబోతుంది అన్నారు. రూ. 123 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ వంతెనకు డిసెంబర్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారన్నారు. రూ. 90 కోట్ల వ్యయంతో ఒక ఆక్వా కల్చర్ నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఆత్మకూరు, అమర్చింత మండలాలకు కలిపి 1400 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అంతా త్వరగా ఇళ్లు కట్టుకోవాలని సూచించారు. ఆత్మకూరులో డయాలసిస్ వ్యాధిగ్రస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లి అవస్థలు పడకుండా నేడు ఆత్మకూరులోనే నూతన డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని తెలిపారు. డయాలసిస్ సెంటరు కు జనరేటర్, కంటైనర్ ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ కు కృతఙ్ఞతలు తెలిపారు. వచ్చే రెండేళ్లలో ప్రతి మండలానికి బిటి రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. మస్తిపూర్ గ్రామంలో సీసీ రోడ్లు వేయించినట్లు గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ 10500 మంది చేనేత కార్మికులు కస్టపడి నాణ్యమైన చీరలు తయారు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మహిళా సంఘం సభ్యులు ప్రతి ఒక్కరికి చీర ఇస్తామన్నారు. మహిళల అభివృద్ధికి క్యాంటీన్లు, మహిళా సంఘాలకు పెబ్బేరులో పెట్రోల్ బంక్ మంజూరు చేసినట్లు చెప్పారు . మహిళా సమాఖ్య భవనం త్వరలో పూర్తి కానున్నట్లు తెలిపారు.
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ కే.శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. సరదాగా వ్యాయామం చేసారు. అనంతరం ఆత్మకూరు లో మున్సిపాలిటీ పరిధిలో 37 మంది మహిళలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వులను మంత్రి చేతులమీదుగా అందజేశారు. అందరూ త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉచిత డయాలసిస్ సెంటర్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ రాహమతుల్ల, గీత కార్మికుల సంఘం రాష్ట్ర చైర్మన్ నాగరాజు, అడిషనల్ డి ఆర్ డి ఓ సరోజ, తహసిల్దార్ చాంద్ పాషా, ఎంపీడీఓ శ్రీపాద్, మండల ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





