కొత్త ఎరుక కలిగించే కథలు

సుధా మురళి

ఎరుక అంటే ఏమిటి!? “ఎరుక” అంటే తెలుసుకోవడం కదా. అంచనా వేయడం అనే కదా. దూరాన్ని దగ్గరగా చూడగలిగే దృష్టి. భవిష్యత్తు గమనాన్ని గమనించే సామర్థ్యం ఇవే కదా ఎరుక కలిగి ఉండటం అంటే. మరి ఒకప్పుడు ఊర్ల మధ్య తిరుగుతూ జాతకాలు చెప్పిన ఒక వర్గం, ఇతరుల జీవితాలకు “ఎరుక” ఇచ్చిన ఒక వర్గం వారి జీవితాల పట్ల ఎటువంటి ఎరుకా లేకపోవడాన్ని ఏమంటారు!?. సమాజం వారి జీవితాలపై ఎరుక చూపలేదు సరే జ్ఞానంచెప్పే హక్కు ఉన్నవారికి, తమ జీవితంపై నిర్ణయం చెప్పే హక్కును కూడా ఇవ్వలేదు. ఇది కేవలం సామాజిక అన్యాయం అని సరిపెట్టుకుందామా!? లేక ఒక అస్తిత్వ పరాభవం అని గ్రహించగలమా!?  “నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది” అని చెప్పగలిగిన వ్యక్తి, తన భవిష్యత్తును తానే నిర్మించుకోలేని స్థితిలో ఉంటే, ఆ బాధ ఎంత లోతైనది? ఆ వ్యధను ఎన్నిగాథలుగా చెబితే లోకానికి అర్థమౌతుంది, లోకం చూపగలిగే సహానుభూతి వారిదాకా చేరుతుంది!? ఈ ప్రశ్నలు ఏకలవ్య కాలనీ ఎరుకుల జీవన గాథల గాఢత తగిలిన మనసు కోరుతున్న సమాధానాలు, ఈ అక్షరాలు ఆ అక్షరాలలోని జీవితాలను చూసిన తరువాత, జీవన సంక్షోభాలను స్పృశించిన తరువాత నలుపెక్కుతున్న ఆలోచనలు, ఎరుపెక్కుతున్న కోపాలు.

పర్ స్పెక్టివ్స్ హైదరాబాద్ వారు ప్రచురించిన ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు కథా సంపుటిలో పలమనేరు బాలాజి రాసిన 18 కథలు పాఠకులకు కొత్తఎరుకను స్పృహను చైతన్యాన్ని అవగాహనను కలిగించేవే. ఈ కథలు మన సమాజానికి కేవలం సాహిత్యానందాన్ని మాత్రమే ఇవ్వవు; అవి మన సమాజపు నిగూఢ నిర్మాణాలను ప్రశ్నించే నిలువెత్తు ఆగ్రహాలై నిలుస్తాయి. అట్టడుగు వర్గాల జీవన వాస్తవాలను చిత్రీకరించడం మాత్రమే ఈ పుస్తక లక్ష్యంగా మనకు కనపడదు, ఆ వాస్తవాల వెనుక దాగి ఉన్న అస్తిత్వ సంక్షోభాన్ని వెలికితీయడం దాని అసలుసిసలు కర్తవ్యంగా కనిపిస్తుంది.

‘కాలనీ’ అనే పదం ఇక్కడ ఒక నివాస స్థలం మాత్రమే కాదు, అది ఒక సామాజిక విభజన గీత. ఎవరు లోపల? ఎవరు బయట? ఎవరు ఎవరు? ఎవరు ఎందుకు? అనే నిర్ణయాలు ప్రకటించుకోగలిగే ఒక సామూహిక ఒప్పుకోలు. అయితే ఈ అంశాలను ఇందులోని కథలు ప్రత్యక్షంగా స్పృశించవు; ఇందులో రాయబడిన నిజ జీవన సంఘటనల సాక్షీ రూపాలైన ప్రతీ కథా, ప్రతి సంఘటన, ప్రతి పాత్ర, ప్రతి నిశ్శబ్దం, ప్రతీ శబ్దం ఇటువంటి అనేక విషయాలను పాఠకుని ముందుంచుతుంది, చర్చించమని బలవంత పెడుతుంది. అస్తిత్వవాద దృష్టిలో అయితే  మనిషి ముందుగా ఉనికిగా నిలుస్తాడు; తర్వాత తన అర్థాన్ని నిర్మించుకుంటాడు. ఈ కథల పాత్రలు కూడా అలాగే జీవిస్తాయి. వారు నిర్వచించబడిన వర్గాల ప్రతినిధులే అయినా, తమ వ్యక్తిగత గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే అంతర్గత తపనతో ముందుకు సాగుతారు. ఆ ఎదురీతలో కొన్ని కోల్పోతూ, కొన్ని పొందుతూ తమని తాము నిలుపుకునే దిశగా నడకలు నేర్చుకుంటారు. ఇది నిత్యకృత్యమే, అయితే ఇందులో ఏ ఒక్క వర్గానికి మరో వర్గంతో పోలికను తీసుకురాలేము. ముందే చెప్పుకున్నట్టు గతమే ఎవరి వర్తమానాన్ని అయినా నిర్దేశించే అత్యంత ఆవశ్యక విషయం అయినప్పుడు ఎవరి బాధలు, ఎవరి పోరాటాలు వారివిగానే చూడబడతాయి, పరిష్కారాలు అందనంత దూరం జరుపబడతాయి.

ఇక ఈ కథల్లోని ఒక్కో కథా, ఒక్కో బలమైన విషయాన్ని చర్చిస్తుంది. తమ వాళ్ల బాగుకోసం పాటుపడే మనుషులని, తమ వాళ్ళను శిక్షించలేక లేదా మోపబడిన నిందారోపణలు నిరాధారమైనవని నిరూపించలేక, కాపాడలేక, కాపాడుకోలేక తమ భవిష్యత్తునే పణంగా పెట్టిన మనుషులు, తమకున్న పరిమితుల్లోనే అందాలని వెతుక్కుంటూ, ఆవేదనలు పంచుకుంటూ, ఒకరికొకరై బతికిన మనుషులు, ఒకరికోసం అందరై నిలబడ్డ మనుషులు, జీవితానికి ఎదురీతుతున్న అనుభవాలు, ఎదురీత నేర్పిస్తున్న యుద్ధాలు, అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురాగలిగిన ఉద్వేగాలు, చిచ్చుల ఉచ్చుల్లో చిక్కుకుని ముళ్ళూ రాళ్ళ పాలైన ఉద్రేకాలు ఇలా సమాజంలోని అనేక రకాల మనస్తత్వాలు, అనేక సామాజిక వ్యవస్థల్లోని వ్యక్తులను పరిచయం చేస్తూ సమాజం అంటే ఇదా అనుకునేలా మన ముందు నిలుస్తాయి!? అన్నిటిలో కొన్ని తెలిసిన కోణాలే అయినా మరిన్ని తెలియని పార్శ్వాల ముసుగును తొలగిస్తాయి.

ఈ కథల్లో రచయిత శైలి గంభీరంగా ఉంటూనే ఉంటూ  నియంత్రితంగా కూడా ఉంటుంది. భావోద్వేగాన్ని అతిగా ప్రదర్శించకుండా, వాస్తవాన్ని నిరాడంబరంగా చిత్రించడంతోటే ఈ సంపుటికి బలం చేకూరింది. సామాజిక విమర్శ కూడా ఇక్కడ నినాదాల రూపంలో కాకుండా, అనుభవాల రూపంలో కనిపించడం ఈ కథా సంపుటి ఆకర్షణీయ లక్షణం. కుల వివక్ష, అధికార దుర్వినియోగం, ఆర్థిక అసమానతలు ఇవి కేవలం ఈ కథల నేపథ్యాంశాలు కావు; ఇవి పాత్రల అస్తిత్వాన్ని మనకు పరిచయించే మార్గాలు.  అయితే ఈ కథలు బాధను మాత్రమే చూపవు. ఆ బాధలోంచి వెలువడే గౌరవాన్ని, ఆ గౌరవం కోసం చేస్తున్న పోరాటాన్ని  కూడా తెలియచేస్తాయి. ఇందులోని

‘ఏకలవ్య’ అనే ప్రతీక ఈ కథల ఎరుక సందర్భంలో అత్యంత సార్ధకంగా నిలుస్తుంది. చరిత్రలో అంగీకారం లేకుండానే సాధన కొనసాగించిన శిష్యుడి రూపం అయిన ఏకలవ్య ఇక్కడ ఒక సామాజిక ఉపమానంగా మారుతుంది. గుర్తింపు లేకపోయినా, అవకాశాలు లేకపోయినా, మనిషి తనను తాను నిర్మించుకునే ప్రయత్నం ఆపడు. అదే ఈ సంపుటి మర్మం. ఈ నిజ జీవిత గాథలు కేవలం అన్యాయాన్ని చూపించడం మాత్రమే చేయవు; అన్యాయం మధ్యలోనూ అస్తిత్వ గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాన్ని నమోదు చేయడం కూడా చేస్తాయి. సాహిత్యం సమాజాన్ని మార్చగలదా అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. కానీ సమాజం గురించి మన ఆలోచనలను కదిలించగలదు అనే విషయంలో సందేహం లేదు. ‘ఏకలవ్య కాలనీ’ కథా సంపుటి ఆ కదలికను సృష్టించే కథా సంపుటి. ఇది ఒక కాలనీ గాధ మాత్రమే కాదు; సమానత్వం పేరుతో నడిచే అసమాన వ్యవస్థల మధ్య మనిషి అస్తిత్వ పోరాటానికి సాహిత్య సాక్ష్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *