బురద చల్లడం ఆపాలి

– బీఆర్‌ఎస్‌కు మంత్రి శ్రీధర్‌బాబు హితవు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మేం బురద చల్లుతాం.. మీరు తుడుచుకోండి అన్నట్టుగా మొదటి నుంచీ బీఆర్‌ఎస్ వైఖరి ఉంటోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రశ్రోత్తరాల సమయంలో బుధవారం కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశ డిపిఆర్‌లో రూ.6,500 నుంచి రూ.7,000 కోట్లు వ్యయం అవుతుందని తాము స్పష్టంగా చెప్పామన్నారు. కేటీఆర్ మాత్రం లక్షన్నర కోట్ల కుంభకోణం అని అవాస్తవాలతో బురద చల్లుతున్నారని ఆక్షేపించారు. తాము పారదర్శకంగా ప్రతిదీ ప్రజల ముందు పెడుతున్నామని, ఇందులో దాపరికాలేవీ లేవని అన్నారు. మూసీ కాలుష్యం అనేది జంట నగరాలకు సంబంధించిన ప్రధాన సమస్య. దీని కోసం తాము చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుగోడ కట్టాలని బీఆర్‌ఎస్ పార్టీ సంకుచిత ఆరోపణలు చేస్తోందని తిప్పికొట్టారు. మూసీకి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ జోన్‌గా గుర్తిస్తూ 2016లో అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది నిజం కాదా అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇళ్లెలా తొలగిస్తారంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. పేదలకు పునరావాసం కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని వివరించారు. ఆ పార్టీకి ప్రజల మేలు గురించి అవసరం లేదు.. మేం ఏ సంకల్పం మొదలు పెట్టినా అభాండాలు వేయడం అలవాటై పోయిందని విమర్శించారు. ప్రజల మేలు కంటే రాజకీయ ఆరోపణలకే బీఆరఎస్ ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు కోసం డిపిఆర్ రూపొందించిన మెయిన్ హార్ట్ అనే సింగపూర్ ఇంజనీరింగ్ సంస్థకు ఇటువంటి పనుల్లో అనుభవం ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. డిపిఆర్ రెండు నెలల్లో తయారు చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధాలన్నారు. ఏడాది సమయం పట్టిందని తెలిపారు. రుణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడిబి)కి డిపిఆర్ పంపించామని, త్వరలోనే దానికి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నట్టు వివరించారు. ఏడీబీ తన తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏడీబీ తిరస్కరించడం అనేది అవాస్తమన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా ఏడీబీకి వీలుకాకపోతే ఇతరత్రా మార్గాలు అన్వేషిస్తామని, ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *