యుద్ధం ఆపాలి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

-శ్రుతి పదేళ్ల యాది సభ

కాళోజీ జంక్షన్ /హన్మకొండ, సెప్టెంబర్ 14 : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని చెలిమి సాహిత్య, సాంస్కృతిక వేదిక కన్వీనర్ మెట్టు రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి లో జరిగిన తంగెళ్ల శ్రుతి పదేళ్ళ యాది సభకు తండ్రి తంగేళ్ల సుదర్శనం అధ్యక్షత వహించగా తెలుగు సాహిత్య విమర్శకులు మెట్టు రవీందర్ ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. యువత సాయుధ పోరాటాన్ని ఎందుకు ఎంచుకుంటుందో ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు. సమాజంలోని అసమానతలు, అవినీతిని నిర్మూలించకుండా ఉద్యమకారులను హతమార్చడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై జరుగుతున్న అమానుష మారణకాండను పౌర సమాజం వ్యతిరేకించాలని కోరారు. ఆదివాసులపై జరుగుతున్న మానవహాననాన్ని ప్రజాప్రతినిధులు వ్యతిరేకించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తమ కలలు నెరవేరుతాయని ఆశించిన యువతకు ఫలితం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాదిలోనే తంగెళ్ల శ్రుతి, సాగర్ లను తెలంగాణ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేసిందని ఆరోపించారు. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలను ప్రజలు ఎప్పటికైనా తిరస్కరిస్తారని అన్నారు. కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కేంద్రం మావోయిస్టులపై డెడ్లైన్లతో సాధించేది ఏమీ ఉండబోదని ఆయన విమర్శించారు. దేశంలో ఈశాన్య రాష్ట్రాల పలు సాయిధ సంస్థలతో చర్చలు జరిపిన ఎన్డీఏ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడానికి ఇబ్బందులు ఏమిటని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలకు ప్రక్రియ ప్రారంభించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విరసం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడం కుమారస్వామి మాట్లాడుతూ సమాజంలోని వివిధ సమస్యలకు పరిష్కారాలను ఇవ్వడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. దేశంలో పాలకులు అజ్ఞానం, అవినీతిని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమ సమాజం కోసం స్వప్నించిన అమరుల త్యాగాలు ఊరికే పోవన్నారు. కార్యక్రమంలో భాగంగా కవి చిలువేరు అశోక్ కవితను చదివారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డాక్టర్ ఎం గంగాధర్, కుటుంబ సభ్యులు తంగెళ్ల కుమారస్వామి, గోవర్ధన్,శాంతి చర్చల ప్రతినిధి వేకువ దుర్గాప్రసాద్, కవులు ఆదిరెడ్డి, శాఖమూరి రవి, అమరుల బంధుమిత్రుల సంఘం జిల్లా నాయకులు భారతక్క,ఊర్మిళ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ బి.రమాదేవి,పార్వతీ,కామ్రేడ్ వివేక్ తల్లిదండ్రులు యోగానంద్,మాధవి,కామ్రేడ్ రాకేష్ తల్లి,శ్రుతి తల్లి రమాదేవి బంధువులు,మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *