– కేటీఆర్‌కు మంత్రి సీతక్క ఉద్బోధ
ములుగు, ప్రజాతంత్ర, జులై 8: ములుగు ప్రజలు దీవిస్తే మంత్రిని అయ్యాను.. నియోజకవర్గమే నాకు అండ.. నీలాగా కుల బలం.. ధన బలం అహంకార బలం నా వద్ద లేవు అని మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగులో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీరు నిర్వహించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు నేను మంత్రినైతే తట్టుకోవట్లేదని కేటీఆర్‌నుద్దేశించి అన్నారు. చిల్లర రాజకీయాలు మాని అభివృద్ధికి సహకరించండి.. విలువైన ప్రతిపక్షంగా నిలవండి అని హితబోధ చేశారు. ములుగులో ఇందిరమ్మ పాలన సాఫీగా సాగుతోంది.. ఇబ్బందులు, నిర్బంధాలు లేవు.. నా మీద ఉన్న అభిమానాన్ని, ములుగు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారు.. పక్క నియోజకవర్గాలలో చిత్తుగా ఓడిపోయి అక్కడ ఎవరూ పట్టించుకోక ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు.. నిజంగా మనిషివి అయితే పోలీసు రాజ్యం ములుగులో ఉందని నిరూపిస్తావా అని నిలదీశారు. మీ హయాంలో తమ పార్టీ కార్యకర్తల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు లక్ష్మీదేవిపేట, చల్వాయితోపాటు ఎన్నో గ్రామాల యువకుల మీద కేసులు పెట్టి వేధించారు.. చర్చకు సిద్ధమా? అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. మీ దొర దురంకారాన్ని, కుట్రలను రాష్ట్ర ప్రజలు, ములుగు ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. మీరు శాంతియుత ధర్నా చేసుకుంటామని చెప్పి మంత్రుల కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేశారు అని నిలదీశారు. మీకు రాజకీయ డ్రామాలు తప్ప బాధిత కుటుంబాలను ఆదుకునే సోయి లేదన్నారు. ములుగు నియోజకవర్గంలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ పోలీస్ అధికారులు ఉన్నారు.. వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీ హయాంలో ములుగు నియోజకవర్గంలోని చల్వాయిలో రమేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని పరమార్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చాం.. మీరు ప్రజలను పొట్టన పెట్టుకుంటే మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని చెప్పారు. మీ పాలనలో బీఆర్‌ఎస్ నేతల వేధింపులకు ఎందరో బలయ్యారు.. సూసైడ్ లేఖలు, సెల్ఫీ వీడియోలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు.. సిరిసిల్లలో ఇసుక లారీలతో ప్రజలను తొక్కించి చంపించిన చరిత్ర మీది అని అన్నారు. మంథనిలో అడ్వకేట్ దంపతులను నరికి చంపింది ఎవరు? సిద్దిపేటలో ఆటో డ్రైవర్ శిలాసాగరం రమేశ్‌కు డబల్ బెడ్ రూం రాకుండా బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అడ్డుకుంటే సిద్దిపేట కలెక్టరేట్ వద్ద పురుగు మందు తాగి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. కొత్తగూడెం అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు బీఆర్‌ఎస్ నేత రాఘవేంద్ర వేధింపులు తాళలేక ఓ కుటుంబం సూసైడ్ చేసుకుంది.. మెదక్ జిల్లా రామాయంపేటలో మీ నేతలు వేధిస్తున్నారని తల్లీకొడుకులు పద్మ, సంతోష్‌లు సెల్ఫీ తీసుకుని పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకున్నారు.. మీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరింపులతో ఖమ్మంలో సాయిగణేష్ అనే యువకుడు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇలా ఎందరో మీ వేధింపులకు బలైతే ఆ కుటుంబాను కనీసం పరామర్శించలేదు’ అని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించే కేటీఆర్‌కు సంస్కారం లేదు.. ఆయనకు ఒళ్లంతా దొరంకారమే.. ఉద్యమ సమయంలో జనాలను రెచ్చగొట్టి చనిపోయేలా చేసి మీరు మాత్రం అధికారం అనుభవించారు అని విమర్శించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ములుగులో కనీసం వేయి ఇండ్లు కట్టించి ఇవ్వలేదంటూ మీకు మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
వైఎస్సార్ సేవలను గుర్తు చేసుకున్న సీతక్క
అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ములుగు క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి మంత్రి సీతక్క నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.





