విదేశీ మహిళల కాళ్లు కడిగించడం దారుణం
రాష్ట్ర మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
సోనియా గాంధీకి మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధుల లేఖ
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అవమానకర ఘటనలపై మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి కలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళలకు కాళ్లు కడిగించడం వంటి ఘటనలు మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం బానిసత్వం వైపు నడిపిస్తోందని మాజీ మంత్రులు విమర్శించారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అడుగడుగునా మోసం చేస్తోందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే తన తీరు మార్చుకోవాలని సూచించారు. తెలంగాణలో జరిగిన ‘వరల్డ్ పోటీలు’ సందర్భంగా విదేశీ మహిళలకు కాళ్లు కడిగించిన ఘటన తీవ్రమైన దుమారానికి, వివాదానికి దారితీస్తోంద వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలకు, తల్లులకు, అక్కచెల్లెళ్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగి, తుడిచే పనులకు మహిళలను ఉపయోగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్,సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల స్వాభిమానాన్ని అందాల పోటీదారుల పాదాల చెంత ఉంచి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సంస్కృతిని అవమానించారన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అంతులేని బాధను కలిగించిన ఈ ఘటనపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీకి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్,సునీత లక్ష్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ లు లేఖ రాశారు.
దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమం, అసంఖ్యాక అమరవీరుల త్యాగాల గురించి అవగాహన ఉన్న సోనియా గాంధీ, తమ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పిచ్చి పనులను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ మహిళల కాళ్లు కడిగించిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్య రాష్ట్ర ప్రజల మనసును తీవ్రంగా బాధించిందన్నారు. మహిళా సాధికారత పేరిట ఇలాంటి పనులను చేయించడం ప్రభుత్వ దిగజారుడు వైఖరికి నిదర్శనం అన్నారు. రేవంత్ రెడ్డి చర్యలు తెలంగాణ సంప్రదాయాలను అవమానించడమే కాక, ప్రపంచం ముందు ఈ నేల ఖ్యాతిని మంటగలిపాయని మహిళా నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేల స్వాభిమానానికి తెలంగాణ మహిళలు నిదర్శనమని, వయసుతో సంబంధం లేకుండా ఆడబిడ్డల కాళ్లు మొక్కడం ఇక్కడి సంప్రదాయమని అన్నారు. అలాంటి గడ్డ మీద తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడం అనేది తెలంగాణ సంప్రదాయం కాదు. రేవంత్ రెడ్డి వికృత వ్యక్తిత్వానికి సాక్ష్యమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు తెలంగాణ స్ఫూర్తిని అర్థం చేసుకోలేని అజ్ఞానాన్ని, ఎవరినో సంతోషపెట్టడానికి ఈ నేల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే దాస్య మనస్తత్వాన్నే చూపిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తనతో తెలంగాణ ప్రతిష్ట మసకబారుతుందన్నారు.
గత 19 నెలలుగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి, రాష్ట్ర ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ, అడుగడుగునా తెలంగాణ స్వాభిమానాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఓవైపు తెలంగాణ దివాలా తీసిందని, ఖజానా పూర్తిగా ఖాలీ అయిపోయిందని, అప్పు కోసం వెళ్తే దొంగను చూసినట్టు చూస్తున్నారని తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్న ముఖ్యమంత్రి మరోవైపు అందాల పోటీల కోసం ఏకంగా రూ.200 కోట్ల ఖర్చు చేయడం తెలంగాణ మహిళలను మాయమాటలతో మోసం చేయడమే అన్న సంగతి ప్రజలు తెలిసిందన్నారు. ఇలాంటి ఆర్భాటాల కోసం రూ. 200 కోట్లు వెచ్చించడం కంటే, ఆ మొత్తాన్ని మహిళల సంక్షేమం, విద్య, ఉపాధి కోసం ఉపయోగించి ఉంటే రాష్ట్ర ఆడబిడ్డలకు నిజమైన గౌరవం దక్కేది అన్నారు.



