మాట‌లు కాదు చేత‌లు చూడండి

-లేఖలు రాసి దులుపుకోవడం కాదు
-జమ్మికుంట-రైల్వే స్టేషన్ ను ‘‘అమృత్ భారత్’’లో చేరుస్తాం
-కరీంనగర్-హసన్ పర్తి నూతన రైల్వే లేన్ నిర్మాణంపై త్వరలో నిర్ణయం
– కరీంనగర్ తిరుపతి రైలు వారానికి 4సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటా: బండి సంజ‌య్‌

క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, మే 22:  ‘‘గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతిదానికి లేఖలు రాసి చేతులు దులుపుకున్నరు. ఇప్పుడు ఇంత అభివృద్ధి  జరుగుతుంటే ఇదంతా మావల్లే జరిగిందని వాళ్లు ప్రచారం చేసుకుంటున్నరు. మాటలు కాదు  బుల్లెట్ దిగిందా? లేదా? చూడాలి’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  వ్యాఖ్యానించారు. గురువారం దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మ‌ట్లాడుతూ  ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి  చెందాయో చెప్ప‌డానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణే నిదర్శనమన్నారు. అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సైతం అమృత్‌ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తామన్నారు.

కరీంనగన్ నుండి హసన్ పర్తి వరకు 61 కి.మీల నూతన రైల్వే లేన్ నిర్మాణంపై సర్వే పూర్తి చేసి స‌వివ‌ర‌మైన  నివేదిక‌ తయారు చేశామన్నారు. ఈ నూతన లేన్ నిర్మాణానికి రూ.1480 కోట్ల వ్యయం అవుతుందని డీపీఆర్ లో పేర్కొన్నారని, దీనిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కరీంనగర్ నుండి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని తనతోపాటు పొన్నం ప్రభాకర్ సైతం లేఖలు రాశారని, అయితే రద్దీ, సాంకేతిక కారణాల రీత్యా అది సాధ్యపడలేదన్నారు. వారానికి రెండుసార్లు నడుస్తున్న ఈ రైలును వారానికి 4సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  కాగా  దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల వ్యయంతో 1350 రైల్వే స్టేషన్లను ‘‘అమృత్ భారత్’’ పథకం కింద ఆధునీకరిస్తున్నం.

వీటిలో రూ.2 వేల కోట్ల వ్యయంతో ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభించుకోవడం ఆనందంగా వున్న‌ద‌న్నారు. ఏ దేశంలోనైనా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితేనే ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. దీన్ని గుర్తించే  రోడ్లు, రైల్వే, ఏవియేషన్ రంగాలపై మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.  గత 11 ఏళ్లలో తెలంగాణలో 20కి పైగా ప్రాజెక్టులు, 2,298 కిలోమీటర్ల మేర పనులు చేపట్టినం. ఒక్క తెలంగాణలోనే రూ.42 వేల 119 కోట్ల  విలువైన రైల్వే పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ ఒక్క ఆర్ధిక సంవత్సరంలోనే బడ్జెట్ లో తెలంగాణ రైల్వే ప్రాజెక్లులకు రూ. 5 337 కోట్లు కేటాయించామ‌న్నారు. వచ్చే నెలాఖరులోగా ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో ఒక లైన్ ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. సంజయ్ తోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *