ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై చట్టప్రకారమే ముందుకు

– హరీష్‌ ‌రావుకు ట్యాపింగ్‌లో ఊరట అబద్దం
– పదో తరగతి పరక్షలు లేకుండా 12 తరగతులు
– విద్యారంగంలో కీలక మార్పులకు కసరత్తులు
– కమిటీ అధ్యయనం తరవాత విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయం
– మేం వచ్చాక రూ.3.47 లక్షల కోట్లు అప్పులు చేశాం
– రూ.3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులకు చెల్లించాం
– కెసిఆర్‌ను గృహ నిర్బంధం చేసిన కేటిఆర్‌, ‌హరీష్‌ ‌రావు
– హిల్టు టీడీఆర్‌ ‌భూ బదలాయింపులపై విచారణకు సిద్ధ్దం
– డ్రగ్స్‌పై నోరు మెదపని బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌నేతలు
– మీడియతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి 20: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌విషయంలో చట్టప్రకారమే ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్‌రావు అందుబాటులో లేకపోవడంతో దర్యాప్తు 20 నెలలు ఆలస్యమైందన్నారు. ఇందులో అరెస్ట్‌లు తప్పవని కూడా అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ‌దొరికినా.. బీజేపీ నేతలు మాట్లాడటం లేదని, బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కలిసి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఇకపై పదో తరగతి పరీక్షలు లేనట్లే’నని చెప్పారు. ప్రస్తుతం.. దేశమంతా ప్లస్‌ 2 ‌విధానం అమల్లో ఉందని ప్రస్తావించారు. తమది వెల్ఫేర్‌ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌బడ్జెట్‌ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మీడియాతో చిట్‌చాట్‌ ‌చేశారు. ఫార్మూలా ఈ-కార్‌ ‌రేస్‌, ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసుల్లో చట్టప్రకారమే ముందుకెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము తొందరపడితే టెక్నికల్‌ ‌రీజన్స్‌తో కోర్టు తిరస్కరించే ప్రమాదముందని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి హరీష్‌ ‌రావుకు ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో న్యాయస్థానంలో ఊరట లభించలేదన్నారు. చక్రధర్‌ ‌గౌడ్‌.. ‌హరీష్‌ రావుపై పెట్టిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌, ‌వేధింపుల కేసులో ఆయనకు రిలీఫ్‌ ‌లభించిందని ప్రస్తావించారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ అం‌శంలో తనను విచారణకు రమ్మని నోటీసులిస్తే హాజరవుతానని తెలిపారు. విచారణ పూర్తి కాకుండా చర్యలు తీసుకోలేమన్నారు. కేసీఆర్‌ ‌బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. అల్లుడు, కుమారుడు కలిసి కేసీఆర్‌ను గృహ నిర్బంధం చేశారు. అందుకే ఆయన అసెంబ్లీకి రావడంలేదన్నారు. తెలంగాణ జాతిపిత ఎవరో ప్రజలు డిసైడ్‌ ‌చేయాలన్నారు. ఏ గ్యారంటీ ఎప్పుడు అమలు చేయాలో తమ దగ్గర ప్రణాళిక ఉందని సీఎం రేవంత్‌ ‌క్లారిటీ ఇచ్చారు. బిఆర్‌ఎస్‌ ‌నేతలు చెబితే చేయాలని లేదన్నారు. అందుకే వారు అక్కడ ఉన్నారు.. మేము ఇక్కడ ఉన్నామన్నారు. కేసీఆర్‌ ‌హయాంలో అప్పులు, తప్పులు కప్పిపుచ్చి పాలన చేశారని ఎద్దేవా చేశారు. ఆ తప్పులు తాము చేయలేమన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3.47లక్షల కోట్ల అప్పులు చేశామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ‌హయాంలో చేసిన అప్పులను తీర్చేందుకే తాము అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ 26 నెలల్లో రూ.3.3 లక్షల కోట్లు కేసీఆర్‌ ‌హయాంలో చేసిన అప్పుల్నే తమ ప్రభుత్వం తీర్చిందని చెప్పుకొచ్చారు. మేం తెచ్చిన అప్పుల్లో రూ.17వేల కోట్లు మాత్రమే వాడుకున్నాం. జాతీయ జీడీపీ కంటే తెలంగాణ జీఎస్‌డీపీ మెరుగ్గా ఉంది. జీఎస్టీ వసూళ్లు గడిచిన 2 నెలల్లో రూ.4 వేల కోట్లు దాటాయి‘ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకపోయినా రూ.44 వేల కోట్ల కాళేశ్వరంపై అప్పు తీర్చామన్నారు. హిల్టు టీడీఆర్‌ ‌భూ బదలాయింపుల పై మాజీ మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు ఏ విచారణ కోరినా చేపట్టేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇండస్ట్రీకు చెందిన మొత్తం భూములు అమ్మినా లక్ష కోట్ల రూపాయలు రావని ముఖ్యమంత్రి తెలిపారు. హిల్టులో ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. మంత్రి అజారుద్దీన్‌, ‌కోదండరాం ఎమ్మెల్సీ కోసం సుప్రీంకోర్టు సూచన మేరకు తెలంగాణ గవర్నర్‌ను సంప్రదిస్తామని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలను తొలగించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని అన్నారు. ఇప్పుడున్న జిల్లాలు మండలాల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పులూ ఉండవని ఆయన స్పష్టం చేశారు. విద్యాశాఖ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టును కేకే కమిటీకి రిఫర్‌ ‌చేశామని పేర్కొన్నారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్‌ ఎప్పు‌డూ వ్యతిరేకం కాదని సీఎం స్పష్టం చేశారు. భూములు అమ్మితే వచ్చిన డబ్బులను సొంతానికి వాడుకోవడానికి తాము వ్యతిరేకమన్నారు. మూసీ విషయంలో ఆగేది లేదన్నారు. నష్టపోయిన వారిని ఎలా ఆదుకోవాలో ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామని తెలిపారు. దిల్లీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్కపెట్టిన వాళ్లు తాను ఎన్ని నిధులు తెచ్చానో కూడా లెక్కపెట్టాలని హితవు పలికారు. గాంధీ మనవడు కూడా ఒక పౌరుడేనని.. ప్రస్తుతం ఆయనా బీఆర్‌ఎస్‌ ‌ట్రాప్‌లో పడ్డారని అన్నారు. గాంధీ విగ్రహం పెట్టొద్దని అనడం సరికాదని, గాంధీ దేశానికి ఆదర్శపురుషుడని అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలను తిడితే బీజేపీ ఎందుకు మాట్లాడుతోందని నిలదీశారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని అన్నారు. తనను సీఎంగా అంగీకరిస్తున్న మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. జీవన్‌ ‌రెడ్డి అంశాన్ని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌  ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌చూసుకుంటారన్నారు. ఆపరేషన్‌ ‌కగార్‌ ‌కేంద్ర ప్రభుత్వానిది.. తమది కాదని సీఎం పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. మార్పులపై కమిటీ నివేదికే ఫైనల్‌ ‌కాదన్నారు. జాతీయస్థాయి అధ్యయనం తర్వాత మార్పులు తీసుకురాబోతున్నట్లు చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *