రూ.12,500 కోట్లతో స్టీల్ ప్లాంట్

– తెలంగాణతో రష్మి గ్రూప్ ఎంవోయూ
– 12 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు

– ఏబీ ఇన్‌బెవ్ యూనిట్ విస్తరణకు సిద్ధం

దావోస్, జనవరి 21: డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రష్మి గ్రూప్‌తో కలిసి రూ.12,500 కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారి, డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారి తెలంగాణ రైజింగ్ బృందంతో భేటీ అయ్యారు. గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై కూడా చర్చలు జరిగాయి. రష్మీ గ్రూపు ఆసియాలోని 40 దేశాలు, యూరప్, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.

రాష్ట్రంలో ఏబీ ఇన్‌బెవ్ యూనిట్ విస్తరణకు సిద్ధం

ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్‌బెవ్ తెలంగాణలో ఇప్పటికే ఉన్న తన తయారీ యూనిట్‌ను విస్తరించేందుకు భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 50కుపైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక-2026 సదస్సులో భాగంగా దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ’ ప్రతినిధి బృందం ఏబీ ఇన్‌బెవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్‌బెవ్ సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ విధాన స్థిరత్వం, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, వ్యాపార సౌలభ్యంతో తెలంగాణలో పెట్టుబడిదారుల్లో దీర్ఘకాలికంగా విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. సమావేశంలో సర్క్యులర్ వాటర్ వినియోగం, మహిళా సాధికారత, విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించిన సీఎసఆర్ వ్యయాలు వంటి అంశాల్లో తెలంగాణతో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా చర్చించారు.

బ్లైజ్ కంపెనీ ఒప్పందం

కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ (Blaize) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సంస్థ డేటా సెంటర్ అర్టిఫిషియల్ కంప్యూటింగుకు తక్కువ శక్తి వినియోగించే హార్డ్‌వేర్, ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో బ్లైజ్ కో ఫౌండర్ సీఈవో దినాకర్ మునగాý ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చర్చల అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు వేగవంతమవుతాయి. ఇప్పటికే బ్లైజ్ సంస్థ హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవెప్‌మెంట్, ఇంజినీరింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. తమ ఆర్ అండ్ డీ సెంటర్‌ను విస్తరించే పెట్టుబడులు, ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. హెల్త్‌కేర్ డయాగ్నోస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి రంగాల్లో ఏఐ ద్వారా పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్, హార్డ్‌వేర్, ఆటోమేషన్ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. దేశంలోనే టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ వృద్ధి సాధిస్తోందని అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

ప్రపంచంలోనే తొలి బ్యూటీ-టెక్ జీసీసీ ఏర్పాటు చేయనున్న లోరియల్

ప్రపంచంలోనే తొలి బ్యూటీ-టెక్ గ్లోబల్ కేపలిటీ సెంటర్ (జీసీసీ)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ (L’Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభించనుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్-2026లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ-టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని హియెరోనిమస్ తెలిపారు. నవంబర్‌లో జీసీసీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులను లోరియల్ ఆహ్వానించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఇప్పటికే మారియెట్, వ్యాన్ గార్డ్, నెట్ ఫ్లిక్స్, మెక్ డోనాల్డ్స్, హినెకెన్, జాగర్, కోస్ట్కో వంటి గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయన్నారు. జీసీసీతోపాటు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని లోరియల్‌ను ఆహ్వానించారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమల ఎకోసిస్టమ్ ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తయారీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హియెరోనిమస్ సానుకూలంగా స్పందించారు.

టాటా చైర్మన్‌తో ముఖ్యమంత్రి భేటీ

దావోస్‌లో టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.విజన్-2047 లక్ష్యాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల విధానాలను వివరించారు. హైదరాబాద్‌లో స్టేడియాల అభివృద్ధికి టాటా సహకారాన్ని కెÃరారు. స్టేడియాల అప్‌గ్రేడేషన్‌కు టాటా ఛైర్మన్ సంసిద్దత వ్యక్తం చేశారు. అలాగే మూసీ నది పునరుజ్జీవంలో భాగస్వామ్యమయ్యేందుకు, తెలంగాణలో హోటళ్లు, రిసార్ట్స్ ఏర్పాటుపై కూడా టాటా ఆసక్తి చూపింది. రాష్ట్రంలో కొత్త మానుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సీఎం చర్చలు జరిపారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *