– ఎవరు కోరినా మద్దతు ఇస్తాం
– ఫోన్ ట్యాపింగ్ తుదిదశకు చేరుతుందన్న నమ్మకం లేదు
– మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి
జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్‌ను జిల్లా చేయాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. పీవీ.నరసింహారావు పేరు ఏదో ఒక జిల్లాకు పెట్టాలని కూడా కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులు, యువతకు నష్టం జరిగిందని కవిత విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐదు శాతం ఓపెన్ కోటాను నాన్ లోకల్‌గా మార్చడంతో రాష్ట్ర యువతకు నష్టం జరుగుతోందని తెలిపారు. జాగృతి తరఫున అధ్యయనం చేస్తున్నామని, జిల్లాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తే నివేదిక ఇస్తామని తెలిపారు. కొత్త పార్టీ ఏర్పాటు కసరత్తు వేగంగా జరుగుతోందని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి పక్రియ పూర్తవుతుందో లేదో చూడాలని కవిత అన్నారు. పార్టీకి ఇంకా ఏ పేరు అనుకోలేదని.. తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి అని కొందరు సూచించారన్నారు. నైని బొగ్గు గని అంశం కంటే సింగరేణికి కొత్త బొగ్గు గనులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ విధానం ఎప్పటినుంచో ఉందని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని ప్రధాన నిబంధనగా పెట్టారని.. కొంతమందికి మాత్రమే సెలెక్టివ్‌గా ఇస్తున్నారని తెలిపారు. విచారణ చేయించాల్సిన కాంగ్రెస్ నేతలు లేఖ రాయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారన్న అంశం గురించి తనకు తెలీదని, తాను ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో లేనని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ 300 డివిజన్ల ప్రతిపాదన బీఆర్‌ఎస్ హయాంలోనిదే అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కొనసాగిస్తోందని అన్నారు. జాగృతి జనంబాట ముగింపు మార్చి 10న అనుకుంటున్నామని, ఆ తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మంత్రుల అవినీతిపై ర్యాంకులు ప్రకటిస్తామని కవిత పేర్కొన్నారు.’నా టార్గెట్ హరీష్‌రావు, ఇంకా పెద్ద టార్గెట్ కూడా ఉంది. కేటీఆర్‌ను కూడా విమర్శించాను. బలమైన రాజకీయ భవిష్యత్ కోసం పటిష్ట ఎజెండా సిద్ధం చేసుకుంటున్నాను.. రాజకీయ కన్‌స్టలెన్సీలు ఎవరినీ నేను సంప్రదించలేదు.. నన్ను సంప్రదించిన కొంతమందితో మాట్లాడాను’ అని కవిత వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదని విమర్శించారు. ట్యాంక్‌బండ్ మీద ఆంధ్రావారి విగ్రహాలు తప్ప తెలంగాణ మహనీయులవి లేవని, వాళ్ల విగ్రహాలు తొలగించాలని తాము అనటం లేదని, అవసరం వస్తే తప్పదంటూ వ్యాఖ్యానించారామె. అమరజ్యోతిపై అవినీతి మరకలు పడ్డాయని, అందుకే దాన్ని ఓపెన్ చేయడంలేదని కవిత అన్నారు. ట్యాంక్‌బండ్‌పై ముచ్చర్ల విగ్రహం పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





