స్టేషన్ బెయిల్ చట్టాన్ని సవరించాలి

– నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతే నాన్ బెయిలబుల్ కేసులు
– అరైవ్-అలైవ్ కార్యక్రమంపై ఉన్నతస్జ్థాయి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమంపై రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌లో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింగి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్- అలైవ’ వంటి మంచి కార్యక్రమం చేపట్టామని వెంకటరెడ్డి తెలిపారు. డీజీపీ శివధర్ రెడ్డి ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ విధానం మాత్రమే కాదు.. ప్రాణాలను కాపాడే బాధ్యత.. ఇది అందరం కలిసి తీసుకోవాల్సిన సామూహిక బాధ్యత అని చెప్పారు. దేశంలో అనారోగ్యం బారినపడి చనిపోయే వారికంటే ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య అధికంగా ఉన్నదన్నారు. ఎంవోఆర్‌టీహెచ్ లెక్కల ప్రకారం రోజుకు 18 నుండి 20 మంది ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఇందులో 18 నుండి 40 ఏళ్ల లోపు వారు 60% ఉండడం దురదృష్టకరమని అన్నారు. 10మంది చనిపోయినా స్టేషన్ బెయిల్ మీద వస్తున్నారంటూ ఆ చట్టాన్ని సవరించాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. హెవీ వెహికల్స్ (ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, టిప్పర్) నడిపే డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, ఎక్కువ లోడ్ ఉండే వాహనాలు నడిపే వారికి కఠిన నియమాలు పెట్టాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగి ప్రాణం పోతే నాన్ బెయిలబుల్ వంటి కేసులు పెట్టి కఠిన శిక్షలు అమలు చేయాలని సూచించారు. డ్రంకెన్ డైవ్, రాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ వంటి వాటి వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. వీటిపై ఇంకా కఠినంగా వ్యవహరించాలన్నారు. హెల్మెట్ ధరించడం, జీబ్రా క్రాసింగ్స్, సైన్ బోర్డులు ఏర్పాటు లాంటి కార్యక్రమాలు, బ్లాక్ స్పాట్లు గుర్తించి అందుకు తగ్గ చర్యలు తీసుకోవడం వల్ల 70 శాతం ప్రమాదాలను ఆపగలమన్నారు. తాను ప్రయాణించే హైదరాబాద్ – విజయవాడ హైవే మీద నిత్యం ప్రమాదాలు జరుగుతాయంటూ 17 బ్లాక్ స్పాట్లు గుర్తించి నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే చాలావరకు పూర్తి అయ్యాయని చెప్పారు. రాత్రివేళ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయంటూ ఆరఅండ్‌బి శాఖ ద్వారా పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపడతామని, ఇప్పటికే టి-రక్ష యాప్ అందుబాటులో ఉన్నదని తెలిపారు. స్కూల్స్, కళాశాలల పరిసరాల్లో బోర్డులు ఏర్పాటు తప్పనిసరి.. హెవీ వెహికల్స్ నడిపే వారికి, ఇతర డ్రైవర్లకు అందుకు తగ్గ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలకు అధికారులు ప్లాన్ చేయాలన్నారు. సినీ పరిశ్రమలో ప్రముఖుల ద్వారా అవగాహన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్నారు. పోలీస్, ఆర్ అండ్ బి, ట్రాన్స్‌పోర్ట్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేస్తే ‘అరైవ్-అలైవ’ విజయవంతం అవుతుందని చెప్పారు.

నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలి : మంత్రి పొన్నం
రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా డ్రైవర్ నిరక్ష్యం వల్లే జరుగుతున్నాయి.. రోడ్డు నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించాలి అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్ చైర్మన్‌గా గ్రామంలో ఉన్న రిటైర్డ్ టీచర్, విద్యావంతులు, ప్రభావితులతో రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో ముగ్గురు మహిళలు ఉండాలని, ప్రతి నెలా సమావేశం నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణమైన వాటిపై ఆ కమిటీ ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలపై నివేదిక ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో 100% హెల్మెట్ వాడేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జీరో యాక్సిడెంట్ విలేజ్‌పై మోటివేట్ నిర్వహించాలన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు, ఆయా గ్రామాల్లో బాధితుల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎకనామికల్ క్రైసిస్ తదితర వాటిపై సమావేశాలు నిర్వహించి చర్చించాలన్నారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి రోడ్ సేఫ్టీపై కార్యక్రమాలు చేయాలి.. గ్రామంలో బ్లాక్ స్పాట్లు గుర్తించి బ్లాక్ స్పాట్లను తొలగించాలి.. రోడ్ సేఫ్టీపై లైసెన్స్ మేళా ఏర్పాటు చేయాలి.. రోడ్ సేఫ్టీపై చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ ఏర్పాటు చేయాలి.. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే విధంగా ట్రాఫిక్ కూడళ్లలో హెల్మెట్ మాదిరి  ఏర్పాటు చేయాలి. యునిసెఫ్ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించాలి.. ఎన్‌ఫోర్సుమెంట్‌ను కఠినతరం చేయాలి అని అధికారులను ఆదేశించారు. బైక్ రైడర్ మాత్రమే హెల్మెట్ వాడడం కాకుండా వెనకాల కూర్చున్న వారు కూడా హెల్మెట్ వాడాలి.. రోడ్డు నిబంధనలు పాటిస్తామని పిల్లలు తల్లిదండ్రుల వద్ద హామీ పత్రం తీసుకోవాలి.. రోడ్డు నిబంధనలు పాటిస్తామని, హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అవగాహన కల్పించాలి. డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయాలి.. ఆటో డ్రైవర్స్ యూనిఫామ్ ధరించాలి.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరంగా స్పందించడానికి అవగాహన కల్పించాలి.. స్కూల్ బస్సు డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలి.. మైనర్ డ్రైవింగ్‌లపై కఠినంగా వ్యవహరించాలి.. డ్రైవర్స్ అసోసియేషన్, లారీ అసోసియేషన్‌లతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలి అని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ సేఫ్టీపై డిజిటల్ బోర్డు ద్వారా ప్రచారం చేయాలన్నారు. విద్యార్థులకు రోడ్ సేఫ్టీపై కరికులం పూర్తి చేయాలి.. ఆర్టీసీలో 20 సంవత్సరాలుగా రోడ్ ఆక్సిడెంట్ లేని డ్రైవర్లకు అవార్డులు ఇవ్వాలి.. ఐ అండ్ పీఆర్ ద్వారా అరైవ్ అలైవ్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. ఏప్రిల్ 13 నుండి ఆరు రోజులపాటు అరైవ్ అలైవ్ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, డీజీపీ శివధర్ రెడ్డి, పలువురు అధికారులు పలు సూచనలు చేశారు. సమావేశానికి ఆర్ అండ్ బి స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఇýంబర్తి, డీజీపీ శివధర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఎన్‌సిలు మోహన్ నాయక్, జయ భారతి, పలువురు సిఈలు, రవాణా, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు.
——————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *