ఏడూళ్లబయ్యారంలో రేపటినుండి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

హాజరుకానున్న డిప్యూటీ సీఎం, మంత్రులు 

పినపాక, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామం మరోసారి క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రస్థాయి 69వ కబడ్డీ పోటీలు శనివారం నుంచి ఘనంగా జరగనున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జట్లు హాజరుకానున్నాయి. కబడ్డీ క్రీడకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో ఇంత పెద్దస్థాయి పోటీలు నిర్వహించడం విశేషం. పాఠశాలల క్రీడా సమాఖ్య, జిల్లా విద్యాశాఖ, స్థానిక క్రీడా కమిటీలు కలిసి ఈ పోటీలను నిర్వహించనున్నాయి. ఆటగాళ్లకు వసతి, భోజనం, భద్రత వంటి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి అనూష, మణుగూరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ఎవరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘ ప్రతినిధులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. ముగింపు రోజున విజేత జట్లకు బహుమతులు, ట్రోఫీలు అందజేయడమేగాక జాతీయ స్థాయిలో పాల్గొనే రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తారు. పోటీల నిర్వహణలో స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొంటుండగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచడం మా ప్రధాన ఉద్దేశ్యం అని నిర్వాహక కమిటీ ఆర్గనైజిగ్‌ సెక్రటరీ బి.వీరన్న తెలిపారు. ఏడూళ్ల బయ్యారం గ్రామం ఇంత పెద్దస్థాయి క్రీడా వేడుకకు వేదిక కావడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోటీలు విజయవంతమవుతాయని, అందుకనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యా శాఖ అధికారి కొమరం నాగయ్య, పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం తిరుపతిరెడ్డి తెలిపారు. క్రీడాకారులకు కంది చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మాజీ వైస్‌ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి సౌకర్యాల ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *