ధాన్యం కొనుగోలులో తెలంగాణ రికార్డ్

– ఖరీఫ్ 2025-26 లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు
– ధాన్య సంపదకు సంక్రాంతి ప్రతీక
– రాష్ట్ర‌ రైతాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలు
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 13ః ధాన్యం కొనుగోలులో రాష్ట్రం రికార్డు సృష్టించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ముందెన్నడూ లేని రీతిలో 70.82 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసి రికార్డు నెల కొల్పిందన్నారు. గతంలో కొనుగోలు చెసిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ఈ ఖరీఫ్ సీజన్ అధిగమించిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో చారిత్రక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ఈ రికార్డు సాధ‌న‌లో పౌర‌ సరఫరాల శాఖ, నీటిపారుదల శాఖలను సమన్వయం చేయడంతోపాటు రాష్ట్ర రైతాంగం భాగస్వామ్యం ఉందని తెలిపారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఆయన ప్రకటన విడుదల చేశారు. ధాన్య సంపదకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినం జరుపుకుంటున్న రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పర్వదినాన్ని పురస్కరించుకుని రంగవల్లులు తీర్చిదిద్దుతున్న మహిళామణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.  రైతుల కృషిని అభినందించిన ఆయన వ్యవసాయ రంగంపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానాలకు అద్దం పడుతుందన్నారు. 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం కాగా 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 13.97 లక్షల మంది రైతులకు మద్దతు ధర అందించామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం మొత్తానికి రూ.16,912 కోట్లు పై చిలుకని, ఇందులో ఇప్పటికి రూ.16,602 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సన్నాలను ప్రార్థించేందుకు గాను ముందెన్నడూ లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ ను సన్నాలు పండించిన రైతాంగాం ఖాతాలో ఇప్పటివరకు రూ.1,425 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయిన నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియ కుడా ప్రభుత్వం ఒక సవాల్ గా స్వీకరించి 8,448 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతోపాటు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్లనే కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఆయన తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *