రాష్ట్రంలో ప్రాజెక్టుల‌ కోసం రూ.12ల‌క్ష‌ల కోట్ల ఖ‌ర్చు

– గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన కేంద్రం
– అంకిత భావంతో అన్నిర‌కాల అభివృద్ధి
– మిగులు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన ప్ర‌భుత్వాలు
– కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డి

భువ‌న‌గిరి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 6:  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమం కోసం గత 11 ఏళ్లుగా ఎంతో కృషి చేసింద‌ని కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. భువ‌న‌గిరి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శ‌నివారం  ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రూ.12 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను, పథకాల అమలుకు కేంద్రం ఖర్చు చేసింద‌న్నారు. జాతీయ రహదారుల అభివృద్ధిలో, రైతులకు సహాయం అందించడంలో, రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధిలో కేంద్రం అంకిత భావంతో పనిచేస్తోంద‌ని గుర్తుచేశారు. పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్, గత రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ గ్రామాల అభివృద్ధి కోసం ఏమీ చేయలేదు. కేంద్రం నుంచి వచ్చే 15వ ప్రణాళిక సంఘం, ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల అభివృద్ధి జరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. గ్రామీణ అభివృద్ధి కోసం నిధులు ఇస్తే వాటిని పక్కదారి పట్టిస్తున్నాయి. అందుకే నేరుగా కేంద్రం నుంచి గ్రామాలకు నిధులు అందేలా చర్యలు తీసుకున్నామ‌న్నారు. గ్రామాల్లో రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్య కార్మికుల జీతభత్యాలను కేంద్రమే అందజేస్తోంది. గ్రామాల్లోని 83 కోట్ల మంది ప్రజ లకు క్రమం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 5 కేజీల బియ్యం అందజేస్తోంది. రైతులను ఆదుకునేందుకు ఎరువుల ధరలు పెరిగినప్పటికీ సబ్సిడీ రూపంలో అందజేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామ‌న్నారు. 2014లో ఏటా ధాన్యం కొనుగోలు కోసం తెలంగాణలో 3 వేల కోట్లు ఖర్చు చేయగా, మోదీ ప్రభుత్వం వచ్చాక ఏకంగా 26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పత్తి కొనుగోలు కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేసింది.

ఒకప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా కరెంటు కోతలు ఉండేవి. ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరంతరం విద్యుత్ అందిస్తున్నాం. ఒక్క యూనిట్ విద్యుత్ కొరత లేకుండా దేశం ముందుకు వెళ్తోంది. పారిశ్రామిక, కమర్షియల్, గృహ అవసరాలను తీరుస్తోంద‌న్నారు. గ్రామాల ప్రజలు కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలో చెప్పగలరా? మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయించారు. భూములు అమ్మనిదే, అప్పులు చేయనిదే ప్రభుత్వం ఒక్కరోజు కూడా నడవలేని పరిస్థితి. దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలదే పూర్తి బాధ్యత. బంగారు తెలంగాణ అని కేసీఆర్, ప్రజా పాలన అని రేవంత్ రెడ్డిల పాలన చాలా దారుణంగా ఉంద‌న్నారు. ఏం సాధించారని, ఎవరికిచ్చిన హామీలు నెరవేర్చారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారో చెప్పాలి. ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచినందుకా? రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించినందుకా? లేక ప్రభుత్వ భూములు అమ్ముకుని పరిపాలన సాగిస్తున్నందుకా? ఎందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణను అభివృద్ధి చేశామని బీఆర్ఎస్, కాంగ్రెస్ జబ్బలు చరుచుకుంటున్నారు. తెలంగాణ సమాజానికి, మహిళా లోకానికి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారు. పొదుపు సంఘాలకు రుణాలు నరేంద్రమోదీ గారు మాత్రమే ఇస్తున్నారు. అంతే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా కూడా మహిళలకు ఇవ్వలేదు. రైతులకు 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు ఇస్తానని ఇప్పటి వరకు ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది. కాంగ్రెస్ బీసీలకు ఇస్తానన్న లక్ష కోట్లు ఎక్కడ పోయాయి. దళిత బంధు జాడా లేదు. విద్యా భరోసా కార్డు ఎవరికీ అందలేదు. సన్న బియ్యం కూడా ప్రతి కేజీకి కేంద్ర ప్రభుత్వం రూ.43 అందజేస్తోంది. ఉమ్మడి నల్లగొండ అభివృద్ధికి కేంద్రం అనేక నిధులు అందజేసింది.

రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి రూ.35 వేల కోట్లు నిధులు మంజూరు చేశామ‌న్నారు. తెలంగాణలో ఒకే సారి 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. రూ.600 కోట్లతో ప్రారంభించిన కాజీపేట రైల్వే మానుఫ్యాక్చరింగ్ యూనిట్ 65 శాతం మేర పనులు పూర్తయ్యాయి. రూ.1100 కోట్లతో ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు ప్రధాని మోదీ గారు దేశానికి అంకితం చేశారు. ఘట్ కేసర్ వరకు ఈ రైల్వే సేవలు పొడిగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ‌న్నారు.  రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులుపూర్తి కావొస్తున్నాయి. కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. వచ్చే సంక్రాంతికి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తాం. హైదరాబాద్  మెట్రో రైలు రెండో దశకు మద్దతు ఇస్తాం. మరోసారి రాష్ట్ర ప్రభుత్ం మరోసారి డీపీఆర్ పంపాల్సిన అవసరం ఉంద‌న్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశాం. మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడంలో, విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.  పీపీఏ ఒప్పందం కోసం ముందుకు రావాలని కోరుతున్నామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *