రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించండి
– ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించనందుకు నిరసనగా హైదరాబాదులోని ధర్నా చౌక్‌లో ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డిలు కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, జాతీయ పెన్షనర్స్ ఫెడరేషన్ మాజీ సెక్రటరీ జనరల్ ఎ.జి. పూర్ణచంద్రరావు, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ బక్క జడ్సన్ పాల్గొన్నారు. వీరితోపాటు ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, తులసి సత్యనారాయణ, ఎం.వి.నరసింగరావు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో రాక బ్యాంకు రుణాలకు ఈఎంఐలు కట్టలేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, చదువులు మధ్యలో ఆగిపోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, మరికొందరు వృద్ధాప్యంలో అనేక రకరకాల రుగ్మతలతో హాస్పిటల్స్ పాలై ఖర్చులు భరించలేక, రుగ్మతలు వికటించి 26మంది అసువులు బాశారని తెలిపారు. ఇంకా ఎంతమంది పెన్షనర్లు చావాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇవి ప్రభుత్వ హత్యలేనన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 14వేల మందిలో వెయ్యిమందికి హైకోర్టు ఉత్తర్వుల మేరకు, వ్యక్తిగత పరిచయాల మేరకు ప్రయోజనం కలిగిందని, ఇంకా 13వేల మందికి బకాయిలు రావలసి ఉన్నవని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.35 లక్షల నుండి రూ.75 లక్షల వరకు ఉందని, ఆ డబ్బులన్నీ ఏక మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పెన్షనర్ల బాధలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అనేక విజ్ఞాపనలు ఇచ్చినప్పటికీ ఉలుకుపలుకు లేదని విమర్శించారు. నగదు రహిత చికిత్స పద్ధతిని అమలు చేస్తామని గత ప్రభుత్వం ఎన్నోమార్లు మాటిచ్చి తప్పిందన్నారు. ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి 20 నెలలు దాటినా కమిటీలు వేస్తూ మీటింగులు పెడుతూ వారం పది రోజులు అంటూ కాలయాపన చేస్తున్నదన్నారు. ఈహెచ్‌ఎస్ అమలుపరిచినా కొందరు పెన్షనర్లనయినా బతికించుకొని ఉండే వారం కదా అన్నారు. కేవలం పెన్సనర్ల బెనిఫిట్స్ చెల్లింపులకు నిధులు లేవా అని నిలదీశారు. మూడు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరూ కలిసి రాబోయే ఎన్నికలలో తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరించారు. 30 నుండి 40 సంవత్సరాలు ప్రభుత్వ సేవలు అందించిన పెన్షనర్లకు పెన్షన్, వారు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు తిరిగి ఇవ్వడానికి వేధింపులా అని వారు నిలదీశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామన్నారు. అమలు కాలేదు.. అప్పటివరకు పెండిరగ్‌లో ఉన్న మూడు డీఏలు చెల్లిస్తామన్నారు.. ఇప్పటికి ఐదు డీఏలు పెండిరగ్‌లో ఉన్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్ల ఆత్మహత్యలు, అనారోగ్య మరణాలు పెరగకముందే వెంటనే తమ పెండిరగ్ బిల్లులన్నింటినీ ఏక మొత్తంలో చెల్లించాలని వక్తలందరూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్య సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాగస్వామ్య సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, బాధిత పెన్షనర్ల రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాష్ట్రవ్యాప్తంగా రెండువేల మంది పెన్షనర్లు పాల్గొన్నారు. ధర్నాలో ఎం.వి.నరసింగరావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బకాయిల సాధన సమితి రాష్ట్ర అడ్‌హక్ కమిటీ కన్వీనర్ కోహెడ చంద్రమౌళి, కో కన్వీనర్ ఎస్.ధర్మేంద్ర, జయరాం, సత్యనారాయణ, భిక్షపతి సత్యనారాయణ, ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు, జి.వీరస్వామి రాష్ట్ర నాయకులు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఈ.నరసింహారెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు తుమ్మల వీరయ్య, రామ్ మనోహర్, సుధీర్ బాబు, సమ్మారెడ్డి, సాంబయ్య, ప్రభాకర్ రెడ్డి, వివిధ జిల్లాల ప్రధాన బాధ్యులు, ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





