– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల
– డ్రగ్-రెసిస్టెంట్ టిబి నిర్ధారణ కిట్ల ఆవిష్కరణ
హైదరాబాద్, మార్చి 17: డ్రగ్ రెసిస్టెంట్ క్షయవ్యాధి నిర్ధారణ కోసం ఆధునిక డయాగ్నస్టిక్ కిట్ల తయారీలో రాష్ట్రం తాజాగా ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య వ్యవస్థలకు ఔషధాలకు లొంగని ప్రాణాంతక క్షయవ్యాధి పెను సవాలుగా మారిందన్నారు. దీనిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స అందించడం ద్వారా రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. శాసనసభ కమిటీ హాల్‌లో హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో తయారైన డ్రగ్ రెసిస్టెంట్ క్షయ వ్యాధి కిట్లను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఫ్రెంచ్ డయాగ్నటిక్స్ దిగ్గజం బయోమెరియో ఈ కిట్ల ఉత్పత్తిని ప్రారంభించింది. బెంగళూరులోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ, ఆరోగ్య, సామాజిక వ్యవహారాల కౌన్సిలర్ చార్ల్స్ మహీ, బయోమెరియో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెగ్జాండర్ మెరియో ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. టిబి వ్యాధి నిర్మూలన దిశగా దేశం చేసున్న ప్రయత్నాలకు సహకరిస్తున్న బయోమెరియో యాజమాన్యాన్ని ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు ప్రశంసించారు. 1963లో స్థాపించిన బయోమెరియో ఇన్-విట్రో డయాగ్నస్టిక్స్ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందింది. సుమారు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల (దాదాపు రూ.36 వేల కోట్ల) వార్షిక టర్నోవర్‌తో 160 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంటువ్యాధులు, క్యాన్సర్, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ రంగాల్లో వినూత్న డయాగ్నస్టిక్ పరిష్కారాలను అందిస్తోంది. జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటు కోసం బయోమెరియో మొదటి దశలో రూ.50 కోట్లు వ్యయం చేసింది. ఇందులో 100 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. త్వరలో ఇక్కడ పరిశోధన, అభివృద్ధి లేబరేటరీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. కార్యక్రమంలో తెలంగాణా లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సర్వేశ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
నివేదిక అందజేత..
ఈ సందర్భంగా ఇండో ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రూపొందించిన రెండు దేశాల వాణిజ్య సంబంధాల నివేదికను కాన్సుల్ జనరల్ మంత్రి శ్రీధర్ బాబుకు అందజేసారు. తెలంగాణ అభివృద్ధిలో ఫ్రెంచ్ సంస్థల భాగస్వామ్యాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది.జినోమ్ వ్యాలీలో తయారైన డ్రగ్ రెసిస్టెంట్ టిబి డయాగ్నస్టిక్ కిట్లను మంత్రికి అందజేస్తున్న బయోమెరియో సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అలెగ్జాండర్ మెరియో, ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, సిఇఓ సర్వేశ్ సింగ్ లు ఫోటోలో ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



