అధికార్లను ఆదేశించిన ప్రభుత్వ సి.ఎస్. కె. రామకృష్ణారావు
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను సిఎస్ ఆదేశించారు. ఈ వేడుకలకు కావలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణా రావు గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ముందుగా గన్ పార్క్ ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకల ఏర్పాట్లపై ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారి నియమించి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ కు వచ్చే వాహనాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని వాటర్ ప్రూఫ్ షామియానాలు, బారికేడింగ్ మరియు సైనేజెస్ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ తోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని దీంతో పాటు జనరేటర్ బ్యాకప్ కూడా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలని సమాచార శాఖ కమిషనర్ ను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. డిజిపి జితేందర్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్, సమాచార పౌర సంబంధాల కమిషనర్ హరీష్, జలమండలి ఎండి అశోక్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.





