- అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిప్యూటి సిఎం భట్టి
– రెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లు
– మూలధన వ్యయం.. రూ.47,267 కోట్లు
– ఆరు గ్యారంటీల అమలుకు.. రూ.50,713 కోట్లు
– 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా
– జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయింపు
– విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ. 26,674 కోట్లు కేటాయింపు
– వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు
– విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు
– పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు
– పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు
– విద్యా శాఖకు రూ.26,674 కోట్లు
– వైద్య శాఖకు రూ.13,679 కోట్లు
– కార్మిక శాఖకు రూ.998 కోట్లు
– మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు
– ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు,
– ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు
– బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు
– మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు
– ఉపకార వేతనాలకు రూ.4,343 కోట్లు
– యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు
– మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్.. రూ.1500 కోట్లు
– మహాలక్ష్మీ పథకం.. రూ.4,305 కోట్లు
– ఇందిరమ్మ ఇళ్లు.. రూ.5,500 కోట్లు, చేయూత పథకం.. రూ.14,861 కోట్లు,
– రైతు భరోసా.. రూ.18 వేల కోట్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. . సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2026-27 బ్జడెట్‌లో ప్రజా క్షేమం -సామాజిక న్యాయం అనే నినాదంతో ముందుకు సాగింది. ముందుగా అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సంక్షేమం, మౌలిక సదుపాయాలకు సమ ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయం, విద్య, మౌళిక సదుపాయాలు తదితర రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, ప్రజా క్షేమం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. ‘మేం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం’ అని తెలిపారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమన్నారు. అంబేడ్కర్ అడుగు జాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అటు శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ అభివృద్ధ్ది లక్ష్యంగా తాము చేస్తున్న కృషికి బడ్జెట్ తార్కాణమని, గత రెండేళ్ల అభివృద్ధ్ది ఇందుకు నిదర్శనమని అన్నారు. మొత్తం బడ్జెట్ రూ.3,24,234 కోట్లు కాగా, అందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా చూపారు. బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఆరు గ్యారంటీల అమలుకు రూ.50,713 కోట్లు కేటాయించారు. బడ్జెట్ లో 5 కీలక రంగాలకు భట్టి ప్రాధాన్యతనిచ్చారు. వ్యవసాయం, రైతు సంక్షేమం రూ. 23,179 కోట్లు కేటాయించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా, పంట బీమా, రుణమాఫీ పథకాలకు తెలంగాణ బడ్జెట్లో అగ్రతాంబూలం ఇచ్చారు. సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించారు. సర్కారు విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించింది. విద్య, నైపుణ్యాభివృద్ధి రూ. 26,674 కోట్లు కేటాయించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకుల పాఠశాలల నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీతో యువతకు ఉపాధి కల్పించేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లకు భారీగా నిధులు కేటాయించారు. ప్రజా పాలన – ఆరు గ్యారెంటీలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇస్తూ మహాలక్ష్మి, గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్), రూ. 500 కే గ్యాస్ సిలిండర్ వంటి ఆరు గ్యారెంటీల అమలుకు అవసర మైన నిధులను పుష్కలంగా కేటాయించారు.. మౌలిక సదుపాయాలకు గాను మూలధన వ్యయం రూ. 47,267 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా శాశ్వత ఆస్తుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలనలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. సామాజిక భద్రత లో బీమా పథకాలను చేర్చారు. ప్రతి పేద కుటుంబానికి ధీమా కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకం కింద రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం ఈ బడ్జెట్‌లో ఒక కీలక అడుగుగాభావించాలి. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేస్తారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటించారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందచేస్తారు. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకార వేతనం ఇస్తారు. రూ.73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదన చేపట్టారు. కేటాయింపులను పరిశీలిస్తే వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు, విద్యా శాఖకు రూ.26,674 కోట్లు, వైద్య శాఖకు రూ.13,679 కోట్లు, కార్మిక శాఖకు రూ.998 కోట్లు, మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు, పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు, ఎస్సీ సంక్షేమం రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.7,934 కోట్లు, బీసీ సంక్షేమం రూ.12,511 కోట్లు, మైనార్టీ సంక్షేమం రూ.3,769 కోట్లు, కల్యాణ లక్ష్మీ పథకం రూ.3,683 కోట్లు, ఉపకార వేతనాలకు రూ.4,343 కోట్లు, యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ రూ.1500 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ కి రూ.వెయ్యి కోట్లు, మెట్రో రైలు ఫేజ్-2 రూ.600 కోట్లు, మహాలక్ష్మీ గ్యాస్ సబ్సిడీ పథకం రూ.723 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.1143 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు, వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ రూ.3500 కోట్లు, మహాలక్ష్మీ పథకం రూ.4,305 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు రూ.5,500 కోట్లు, చేయూత పథకం. రూ.14,861 కోట్లు, రైతు భరోసా.. రూ.18 వేల కోట్లు, ఆరు గ్యారంటీల అమలుకు.. రూ.50,713 కోట్లు కేటయిస్తున్నట్లు భట్టి ప్రకటించారు.
విద్యార్థులకు శుభవార్త : ఇంటర్‌లో బ్రేక్‌ఫాస్ట్ పథకం
విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు అందరికి బ్రేక్ పాస్ట్ పథకాన్ని అందిస్తామని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలను ఉంచారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకుని వస్తున్నామన్నారు. ఈ పథకాలను 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు వివరించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో ఈ ఏడాది వార్షిక బడ్జెను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. దివ్యాంగ, శారీరక వైకల్య విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్‌డ్ వాహనాల పంపిణీ చేస్తామని తెలిపారు. సంక్షేమ స్కూళ్లలో వసతుల మెరుగుకు చర్యలు చేపడతామన్నారు. అందుకోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే స్కిల్ యూనివర్సిటీని విద్యా శాఖ పరిధిలోకి తీసుకు వస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావతో కూడిన నాణ్యమైన అల్పాహారం అందిస్తారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం ఇకపై మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తారు. ••ష్ట్ర యువతకు విదేశాలలో సురక్షితమైన ఉపాధి, భాషా నైపుణ్యాలు, వీసా మార్గదర్శకత్వం అందించడానికి ఈ కొత్త ప్రోగ్రాం ప్రారంభిస్తారు. ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ’రెట్రో ఫిటెడ్ మోటరైజ్డ్’ వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా
ప్రజల కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. ఈ పథకాన్ని జూన్ 2వ తేదీ నుంచి అమలు చేస్తామని ఆయన వివరించారు. 2026-27 వార్షిక బ్జడెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వార్షిక బ్జడెట్ రూ.3,24,234 కోట్ల అంచనాలతో రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల మేర ఈ బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.