– 2025లో 570మంది లొంగుబాటు
– లొంగిపోయిన వారికి పునరావాసం
– మిగిలినవారు జనజీవన స్రవంతిలో కలవాలి
– పోలీసు శాఖ పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టులకు జనజీవన స్రవంతిలో స్థిరపడే దిశగా రాష్ట్ర పోలీస్ శాఖ అండగా నిలుస్తున్నది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే లొంగిపోయి గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పునరావాస చర్యలను వేగవంతం చేసింది. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస కార్యక్రమాలన్నింటినీ తెలంగాణ నిఘా విభాగానికి చెందిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) నేరుగా పర్యవేక్షిస్తోంది. 1980లో పీపుల్స్ వార్ (ప్రస్తుత సీపీఐ–మావోయిస్ట్) ఆవిర్భవించిన నాటి నుంచి ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది ఏకంగా 576 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరికి పునరావాస ప్యాకేజీలో భాగంగా స్వగ్రామాల్లో నివాస ధ్రువపత్రాలు ఇప్పించి, ఆధార్ నమోదు చేయిస్తున్నారు. అనంతరం పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు తెరిపించి, రివార్డు సొమ్మును అదే ఖాతాల్లో జమ చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి అవకాశం ఉన్న వారికి ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన పలువురికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందించారు.
“పోరు వద్దు – ఊరు ముద్దు. అజ్ఞాతం వీడి జనంలోకి రండి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పునరావాసం కల్పిస్తాం” అని మిగిలిన మావోయిస్టులను రాష్ట్ర పోలీస్ శాఖ సూచించింది. తెలంగాణ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మావోయిస్టు క్యాడర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి . 1ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి – కేంద్ర కమిటీ సభ్యుడు (సీసీఎం & పీబీఎం), రివార్డు రూ.25 లక్షలు. 2.తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ – సీసీఎం, పీబీఎం & జనరల్ సెక్రటరీ, రివార్డు రూ.25 లక్షలు. 3.మల్లా రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ – కేంద్ర కమిటీ సభ్యుడు, రివార్డు రూ.25 లక్షలు. 4.పుసునూరి నరహరి అలియాస్ సంతోష్ – సీసీఎం, ఈఆర్‌బీ సభ్యుడు (జార్ఖండ్‌లో కార్యకలాపాలు), రివార్డు రూ.20 లక్షలు. 5.ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ – రాష్ట్ర కమిటీ సభ్యుడు, డివిజనల్ కార్యదర్శి, రివార్డు రూ.20 లక్షలు. 6.వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు – డీకేఎస్‌జెడ్‌సీ సభ్యుడు, కమ్యూనికేషన్ వింగ్ ఇన్‌చార్జి, రివార్డు రూ.20 లక్షలు. 7.జోడే రత్నబాయి అలియాస్ సుజాత – సీసీఎం, డీకేఎస్‌జెడ్‌సీ ఇన్‌చార్జి, రివార్డు రూ.20 లక్షలు. 8.లోకేటి చందర్ రావు అలియాస్ ప్రభాకర్ – వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి, రివార్డు రూ.20 లక్షలు. 9.బడే చొక్కారావు అలియాస్‌దామోదర్ –రాష్ట్ర కమిటీ సభ్యుడు, సైనిక వ్యవహారాల ఇన్‌చార్జి, రివార్డు రూ.20 లక్షలు. 10.నక్కా సుశీల అలియాస్ రేలా, డీసీఎంస్థాయి కేడర్ రివార్డ్ 5 లక్షలు 11.జాడి పుష్ప అలియాస్ రాజేశ్వరి – డీసీఎం స్థాయి కేడర్లు, రివార్డు రూ.5 లక్షలు చొప్పున. 12..రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, ఏరియా కమిటీ స్థాయి క్యాడర్ రివార్డు 4. లక్షలు 13.బాదిషా ఉంగ అలియాస్ మంతు ఏరియా కమిటీ స్థాయి కేడర్ రివార్డు నాలుగు లక్షలు 14.మడివి అడుమె అలియాస్ సంగీత, ఏరియా కమిటీ స్థాయి కేడర్ రివార్డు 4 లక్షలు 15. కాశపోగు భవాని అలియాస్ సుగుణ ఏరియా కమిటీ స్థాయి క్యాడర్ రివార్డు 4 లక్షలు, 16. కుంజం ఇడమల్ – ఏరియా కమిటీ స్థాయి కేడర్లు, రివార్డు రూ.4 లక్షలు చొప్పున. 17.ఉతిమి అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్ – పార్టీ సభ్యుడు, కంప్యూటర్ ఆపరేటర్, రివార్డు రూ.లక్ష చొప్పున రివార్డులు వున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



