– 9మంది మృతి.. పలువురికి గాయాలు
– ఘటనపై తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం
శ్రీకాకుళం, నవంబర్ 1: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోర ఘటన జరిగింది. వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిదిమంది భక్తులు మృతిచెందారు. కార్తీక మాసం ఏకాదశి శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. ఈ సమయంలో అకస్మాత్తుగా జనసందోహం పెరగడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడగా వారిని సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో తీవ్ర గందరగోళ నెలకొంది. పోలీసులు ఆలయానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనాస్థలిలోనే మృతిచెందారని, ఇద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని, మృతుల్లో 8 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారుని తెలిపారు. సుమారు 25 మంది గాయపడినట్లు సమాచారం ఉందన్నారు. ఈ ఘటన కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ దిగ్భ్రాంతి
ఏపీలోని కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో భక్తులు మృతిచెందడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఏకాదశి పండుగ సందర్భంగా తెలంగాణలోని అన్ని ఆలయాల్లో క్యూ లైన్‌ల ఏర్పాట్లు, కనీస వసతుల కల్పనపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఎండోమెంట్ కమిషనర్ హరీష్‌ను ఆదేశించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు దిగ్భ్రాంతి
కాశీబుగ్గ తొక్కిసలాటపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన అత్యంత దురదృష్టకరం. భక్తులు ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారక విషయం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్యం అందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో భక్తుల భద్రతకు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండేలా అధికారులు సమయానుకూల చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





