స్పృహ కోల్పోయిన యువతి
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సంఘటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ఓ యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే పోలీసులు ఆమెను కొండాపూర్ ఏరియా దవాఖానాకు తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమెను గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థినిగా గుర్తించారు. గచ్చిబౌలి స్టేడియంలో యోగా వేడుకల కోసం నగర ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేడుకలు పూర్తయ్యాక గేట్ నెంబర్ 2 వద్ద ఏర్పాటు చేసిన అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అక్కడికి వెళ్లడంతో తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఈ తోపులాటలో గాంధీ ఆస్పత్రి మెడికల్ కాలేజీ నర్సింగ్ విద్యార్థిని స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. అయితే అనుకున్న దాని కంటే ఎక్కువమంది రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు.


