‘సృష్టి’ కేసులో ఇద్దరు విశాఖ కెేజీహెచ్‌ డాక్టర్లు

– తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: సృష్టి ఫెర్టిలిటీ కేసులో విశాఖపట్నంలోని కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ (కేజీహెచ్‌)కు చెందిన ఇద్దరు వైద్యులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్‌ వాసుపల్లి రవికుమార్‌, ప్రసూతి విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉషాదేవి ఉన్నారు. ఇక వాసుపల్లి రవి కుమార్‌ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు కావడంతో ఈ కేసులో మరో రాజకీయ కోణం వెలుగుచూడబోతోంది. ఇదే కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన డాక్టర్‌ విద్యుల్లత కూడా కేజీహెచ్‌ పిల్లల విభాగంలో పనిచేశారు. ఈ వైద్యులు కేజీహెచ్‌లో విధులు నిర్వర్తిస్తూనే సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు అందించేవారని ఆరోపణలు ఉన్నాయి. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి ఈ అరెస్టులపై తనకు వివరాలు తెలియవని తెలిపారు. డాక్టర్‌ వాసుపల్లి గత మూడు రోజులుగా సెలవులో ఉన్నట్లు-సమాచారం. మరో వైపు ప్రధాన నిందితురాలు డాక్టర్‌ నమ్రతతో సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు వైద్యులు డాక్టర్‌ రమ్య, డాక్టర్‌ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 28కి చేరింది. దర్యాప్తులో బయటపడ్డ వివరాల ప్రకారం సరోగసి పేరుతో డాక్టర్‌ నమ్రత ఇప్పటి వరకు సుమారు 50 మంది బాధితుల వద్ద నుంచి రూ.20 కోట్లకు పైగా వసూలు చేశారు. మరో కీలక నిందితురాలు సంతోషి ఏజెంట్ల ద్వారా 18 మంది శిశువులను సేకరించినట్లు- తేలింది. ముఖ్యంగా గిరిజన మహిళలను ప్రలోభపెట్టి వారి నుంచి శిశువులను కొనుగోలు చేసి, తమ క్లయింట్లకు ఒక్కో శిశువును రూ.50 లక్షలకు విక్రయించినట్లు వెల్లడైంది. మొత్తం 80 మంది పిల్లలను అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తల్లులను గుర్తించి శిశువులను తిరిగి వారికి అప్పగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *